జైపూర్: రాజస్థాన్‌లోని నోఖా మునిసిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మొత్తం 45 వార్డులకు గాను సీపీఐ(ఎం) 29 స్థానాలను కైవసం చేసుకుని ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ 13 వార్డులకే పరిమితమవ్వగా, స్వతంత్రులు మూడు వార్డుల్లో విజయం సాధించారు.
రాజస్థాన్‌లో సాంప్రదాయకంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోటీ ఉండేది. కానీ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా సీపీఐ(ఎం) నిలిచింది. ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) దాదాపు 64.46% ఓట్ల శాతాన్ని సాధించి తన బలమైన పునాదిని చాటుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ(ఎం) 192 స్థానాల్లో పోటీ చేయగా దాదాపు 40 స్థానాల్లో విజయం సాధించి ఈ ఫలితం కేవలం ఒక స్థానిక విజయం మాత్రమే కాదని, రాజస్థాన్‌లో సీపీఐ(ఎం) రాజకీయంగా పుంజుకుంటోందనడానికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ విధానాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తితో పాటు పౌర, ఆర్థిక సమస్యలపై తమ పార్టీ నిరంతరం చేపట్టిన పోరాటాలే ఈ చారిత్రాత్మక విజయానికి కారణమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కిషన్ పారిఖ్ స్పష్టం చేశారు.



