నవతెలంగాణ- ఆత్మకూర్ : వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కేంద్రానికి బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని కోరుతూ మండల, పట్టణ నాయకులు బుధవారం ఆర్టీసీ ఆర్ఎం కి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు, టీజీ టాడీ టాపర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ కేశం నాగరాజు గౌడ్ సూచనల మేరకు అమరచింత అఖిలపక్ష నాయకులు ఈ వినతి పత్రాన్ని అందజేశారు.వనపర్తి, గద్వాల, నారాయణపేట, మహబూబ్ నగర్ ప్రాంతాల నుంచి అమరచింతకు సరైన బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని నాయకులు మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి ఆర్టీసీ ఆర్ఎం గారితో ఫోన్ లో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
వారి ప్రధాన డిమాండ్లు
- వనపర్తి నుంచి వచ్చే ప్రతి బస్సును ఆత్మకూరు మీదుగా అమరచింత వరకు పొడిగించాలి.
- విద్యార్థుల సౌకర్యార్థం చింతరెడ్డిపల్లి – నందిమల్ల, అమరచింత – ఆత్మకూరు మీదుగా వనపర్తి జిల్లా కేంద్రానికి ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలి.నారాయణపేట నుంచి గతంలో నడిచిన మరికల్ – అమరచింత బస్సు సర్వీసులను పునరుద్ధరించాలి.
- మహబూబ్ నగర్ నుంచి అమరచింతకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేసి, గతంలో ఉన్న విధంగా రాత్రి 8 గంటలకు చివరి బస్సు సర్వీసును పునరుద్ధరించాలి.
- మహబూబ్ నగర్ నుంచి ఆత్మకూరు మీదుగా జూరాలకు వెళ్లే బస్సులు అమరచింత మీదుగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలి.అమరచింత ప్రజల రవాణా సౌకర్యం కోసం నాయకులంతా సమిష్టిగా కృషి చేస్తున్నామని వారు తెలిపారు.
- వినతి పత్రం అందజేసిన వారిలో అమరచింత కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జి. రాజేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు టి. రవికాంత్, మున్సిపాలిటీ చైర్ పర్సన్ జింక సువర్ణ రవి యాదవ్, వైస్ చైర్ పర్సన్ ఎస్. రాధ అరుణ్ కుమార్ తదితరులు ఉన్నారు.


