Thursday, September 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పుణ్యక్షేత్రాన్ని తలపిస్తున్న గణేష్ మండపం

పుణ్యక్షేత్రాన్ని తలపిస్తున్న గణేష్ మండపం

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూర్ : గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆత్మకూర్, అమరచింత పట్టణాల్లో వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, కాలనీల్లో యువజన సంఘాలు, ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేసిన గణనాథుల మండపాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో, రకరకాల పూలమాలలతో కనుల పండుగగా అలంకరించబడ్డాయి. రాత్రి వేళ లైటింగ్ డెకరేషన్లు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

 మండపల వద్ద ఉదయం నుండే గణపతికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, కుంకుమ పూజలు, గణపతి హోమాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం వేళ భక్తి పాటలు, కోలాటాలు, భజన కార్యక్రమాలు, చిన్నారుల నృత్యాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వినాయకుడి దర్శనానికి మహిళలు, చిన్నారులు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పట్టణంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డీజేలకు అనుమతి లేకుండా కేవలం భక్తి గీతాలతోనే ఉత్సవాలను నిర్వహించాలని కమిటీలకు సూచించారు. నవరాత్రులు ముగిసే వరకు ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటల పోటీలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు.

ప్రత్యేక ఆకర్షణగా హనుమాన్ నగర్ లోని గణేష్ మండపం అన్ని మండపాల్లోకి ఆత్మకూర్ పట్టణంలోని బీసీ కాలనీలో హనుమాన్ నగర్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. యువకులు ఈ మండపాన్ని ఏకంగా ఒక దేవాలయం మాదిరిగా, పుణ్యక్షేత్రాన్ని తలపించేలా అద్భుతంగా తీర్చిదిద్దారు. మండపం లోపలి, బయటి అలంకరణ చూస్తుంటే భక్తులకు ఏదో దివ్యక్షేత్రంలో ఉన్న అనుభూతి కలుగుతోంది. విద్యుత్ కాంతుల నడుమ చూడముచ్చటగా కొలువుదీరిన గణనాథుడు భక్తులకు అభయహస్తం చూపుతూ దర్శనమిస్తున్నారు.

ఈ మండపాన్ని తిలకించడానికి చుట్టుపక్కల కాలనీల నుండే కాకుండా పట్టణం నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గురువారం బిజెపి రాష్ట్ర నాయకులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి బిజెపి జిల్లా నాయకుడు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్లు జిందే జ్యోతి శ్రీనివాస్, భరత్, చెట్ల లలిత మండల పట్టణ, బిజెపి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.నిర్వాహకుల కృషి, యువకుల ఐక్యతకు ఈ మండపం నిదర్శనంగా నిలుస్తోందని స్థానికులు కొనియాడుతున్నారు. , ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు బీసీ కాలనీ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -