Sunday, September 20, 2026
E-PAPER
Homeసోపతివాడని పూలు

వాడని పూలు

- Advertisement -


కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ఘనంగా చేసే వేడుకలైనా, కేవలం ఇంట్లో చేసుకునే చిన్న ఫంక్షనైనా.. వాటికి ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చేది పువ్వులే! రంగురంగు పూలు కనువిందు చేస్తాయి. అయితే, ఒక్కటే సమస్య. ఎంత ఖర్చు పెట్టి తెచ్చిన పూలైనా సరే.. కొన్ని గంటల్లోనే వాడిపోతుంటాయి. మరికొన్ని ఒకటీ రెండు రోజుల్లో వాడిపోతాయి. అలాగని ప్లాస్టిక్ పూలు అలంకరిస్తే వాటిలో సహజత్వం కనిపించదు. ఈ సమస్యలకు చెక్ పెడుతున్నాయి ఒకరకం పూలు! ఇవి కొనుగోలు దారులకు కనుల పంటగా నిలుస్తూ, సాగు చేసే రైతన్నలకు కాసుల పంట పండిస్తున్నాయి.
ఈ పూలకు రకరకాల పేర్లు ఉన్నాయి. స్ట్రా ఫ్లవర్స్‌, పేపర్‌ డెయ్‌జీస్‌, ఫరెవర్‌ ఫ్లవర్స్‌, ఇమ్మోర్టల్‌ ఫ్లవర్స్‌.. అంటూ పలు విధాలుగా పిలుస్తుంటారు. వీటి శాస్త్రీయ నామం మాత్రం ‘హెలిక్రిసమ్‌’. గులాబీ, మల్లె, జాజి వంటి పూలు ఎంత అందంగా ఉన్నా, వాటి జీవితం చాలా తక్కువ. ఒకరోజు, రెండ్రోజుల్లోనే వాడిపోతాయి. అలంకరణ చేసినా మరుసటి రోజే వాటిని తొలగించి కొత్త పూలు పెట్టాల్సి ఉంటుంది. కానీ స్ట్రా ఫ్లవర్స్‌ విషయంలో అలా కాదు. చెట్టు మీద ఉన్నప్పుడు ఎలా నిగనిగలాడుతాయో.. కోసి ఉపయోగించిన తర్వాత కూడా అంతే స్వచ్ఛంగా ఉంటాయి. అందుకే వీటికి ‘ఇమ్మోర్టల్‌ ఫ్లవర్స్‌’ అంటారు. ఇమ్మోర్టల్ అంటే చావులేనిది అని అర్థం. వీటిని సరైన విధంగా నిల్వ చేస్తే ఏండ్లపాటు తమ అందాన్ని నిలుపుకోగలవని నిపుణులు చెబుతున్నారు.
ఈ పువ్వు సన్‌ఫ్లవర్‌ కుటుంబానికి చెందినది. ఇందులో వందల రకాలున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలోని బీడ్‌, నాగ్‌పూర్‌ జిల్లాల్లో కొన్ని ప్రత్యేక రకాలను సాగు చేస్తున్నారు. బీడ్‌ జిల్లాలోని ఖాపర్‌ పాంగ్రీ ప్రాంతానికి చెందిన ఇంజినీర్‌ ఈశ్వర్‌ శివాజీ షిండే ఈ పంటను సాగు చేసి చుట్టుపక్కల రైతులకు స్ఫూర్తిగా నిలిచారు. దాంతో మిగిలిన వారు కూడా వీటిని సాగుచేస్తున్నారు. బంతి, చామంతి వంటి పూల మాదిరిగానే వీటిని కూడా పండించొచ్చని అంటున్నారు. నీటి లభ్యత కాస్త తక్కువగా ఉన్నా కూడా ఈ పూలను సాగు చేయడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. సాగు చేసిన మూడు నెలలకే కోతకు వస్తాయి.
దాదాపుగా పూలన్నీ సమయానికి కోసేయాలి. మార్కెట్ కు తరలించాలి. లేదంటే చెట్టు మీదనే వాడిపోయే అవకాశం ఉంటుంది. కానీ.. ఈ హెలిక్రిసమ్‌ మాత్రం వెంటనే అమ్మేయాల్సిన అవసరం లేదు. ఎలాగూ ఇవి వాడిపోవు కాబట్టి కొంతకాలం నిల్వ చేసుకుని, ధర బాగా ఉన్నప్పుడే అమ్ముకోవచ్చు. అంతేకాదు.. రైతులే పూలను దండలుగా, మాలలుగా, బొకేలుగా తయారు చేసి నేరుగా వినియోగదారులకు విక్రయించుకోవచ్చు. ఇలా వాటి విలువను పెంచి అమ్మడం ద్వారా రైతులు మరింత ఆదాయం పొందుతున్నారు.
అన్ని పూల మాదిరిగా ఇవి ఎందుకు వాడిపోవు? అనే సందేహం వస్తుంది. ఇక్కడే వీటి ప్రత్యేకత దాగుంది. సాధారణ పూలలో తేమ ఎక్కువగా ఉంటుంది. అందుకే, తేమ ఆవిరవుతున్న కొద్దీ ఆ పూలు వాడిపోతాయి. కానీ, హెలిక్రిసమ్‌ పూలలో తేమ చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే అవి ఎండిపోయిన తర్వాత కూడా వాటి రేకులు సాధారణ పూల మాదిరిగా కుంచించుకుపోవు. ఈ పూలలోని సహజ రంగులు కూడా ఎక్కువకాలం నిలిచే గుణాన్ని కలిగి ఉంటాయి. అందుకే చాలా కాలం నిల్వ ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -