– వైన్స్‌లను మించిన బెల్ట్ దందా.. అధికారుల నిఘా ఏమైంది..?
– తెల్లవారుజాము నుంచే విక్రయాలు.. అర్ధరాత్రి దాటినా దందా..!
నవతెలంగాణ – కుభీర్: మండలంలోని గ్రామాల్లో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాల బతుకులు క్రమంగా ఛిద్రమవుతున్నాయని మహిళలు, గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మండలంలో రెండు వైన్స్ దుకాణాలు ఉండగా.. గ్రామాల్లో మాత్రం గల్లీగల్లీలో ఎలాంటి అనుమతులు లేకుండా బెల్ట్ దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలు, విద్యార్థులు, మహిళలు రాకపోకలు సాగించే ప్రాంతాల్లోనూ మద్యం విక్రయాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పొద్దు లేదు.. రాత్రి లేదు.. ఎప్పుడు పడితే అప్పుడే!
ప్రభుత్వం నిర్ణయించిన సమయాలకు మాత్రమే మద్యం విక్రయాలు జరగాల్సి ఉండగా.. గ్రామాల్లోని బెల్ట్ దుకాణాలకు మాత్రం సమయపాలన లేకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తెల్లవారుజామునే విక్రయాలు మొదలై.. అర్ధరాత్రి దాటినా మద్యం అందుబాటులో ఉంటోందని చెబుతున్నారు. బెల్ట్ దుకాణాలతో పాటు కిరాణా దుకాణాలు, హోటళ్లు, ఇతర షాపుల్లోనూ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. వైన్స్ దుకాణాల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతి గల్లీలో మద్యం దొరికే పరిస్థితి ఏర్పడటంతో యువత, కూలీలు, వ్యవసాయ కార్మికులు వ్యసనాలకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూలీ డబ్బు మద్యం పాలే.. ఇంట్లో పిల్లల పరిస్థితి ఏంటి?
ఎండనకా.. వాననకా రోజంతా కష్టపడి సంపాదించిన కూలీ డబ్బును కుటుంబ అవసరాలకు ఉపయోగించాల్సి ఉండగా.. మద్యం కోసం ఖర్చు చేస్తున్నారని మహిళలు వాపోతున్నారు. పిల్లల చదువులు, ఇంటి సరుకులు, వైద్యం, ఇతర అవసరాలకు డబ్బులు లేక కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయని చెబుతున్నారు. భర్త మద్యం కోసం డబ్బులు ఖర్చు చేయడంతో ఇంట్లో భార్యాపిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరి మద్యం అలవాటు మొత్తం కుటుంబాన్ని ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీస్తోందని మహిళలు కన్నీటితో చెబుతున్నారు. మద్యం మత్తులో వాహనాలు.. బతుకులు బలే!
గ్రామాల్లో ఉదయం నుంచే మద్యం అందుబాటులో ఉండటంతో కొందరు మద్యం సేవించి వ్యవసాయ పనులకు, ఇతర పనులకు వాహనాలపై వెళ్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కుటుంబాలను శాశ్వత విషాదంలోకి నెట్టుతున్నాయని మహిళలు వాపోతున్నారు. రోడ్డు ప్రమాదంలో కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మృతి చెందితే ఆ కుటుంబం పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మద్యం విక్రయాలు కేవలం ఒక వ్యాపార సమస్య కాదని.. కుటుంబాల భవిష్యత్తును ప్రభావితం చేసే సామాజిక సమస్య అని ప్రజలు అంటున్నారు.
అధికారులు చూస్తున్నారా.. లేక చూడనట్టుగా నటిస్తున్నారా?
గ్రామాల్లో బెల్ట్ దుకాణాలు ఎక్కడున్నాయో స్థానికులకు తెలిసినంత స్పష్టంగా సంబంధిత అధికారులకు తెలియదా? అనే ప్రశ్నలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. గల్లీగల్లీలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నప్పటికీ ఎక్సైజ్, పోలీసు శాఖల నిఘా ఎందుకు కనిపించడం లేదని ప్రజలు నిలదీస్తున్నారు. అక్రమ మద్యం విక్రయాలపై తనిఖీలు చేయాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో ఏం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు తరచూ తనిఖీలు నిర్వహిస్తే బెల్ట్ దుకాణాలు ఇంత బహిరంగంగా ఎలా కొనసాగుతాయని ప్రశ్నిస్తున్నారు.
చర్యలు ఎక్కడ? నిఘా ఎక్కడ?
బెల్ట్ దుకాణాలపై చర్యలు తీసుకోవాల్సిన శాఖలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయా? అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలు పెరుగుతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. అక్రమ మద్యం విక్రయాలు అధికారుల కళ్లకు కనిపించవా? కనిపిస్తే చర్యలు ఎందుకు ఉండవు? అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. మద్యం దందాను అరికట్టాల్సిన అధికారులు మౌనం వహిస్తే గ్రామాల్లో నిబంధనలు ఎవరి కోసం అనే ప్రశ్న తలెత్తుతోంది.
మామూళ్ల ఆరోపణలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలి
బెల్ట్ దుకాణాలు ఇంత విచ్చలవిడిగా కొనసాగడానికి ఎవరి అండ ఉందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామాల్లో మామూళ్ల వ్యవహారాలపై గుసగుసలు వినిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆరోపణలకు ఆధారం లేకుంటే బెల్ట్ దుకాణాలపై దాడులు నిర్వహించి తమ నిఘా వ్యవస్థ సమర్థతను నిరూపించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇప్పటికైనా కళ్లుతెరవాలి..
మండలంలోని ప్రతి గ్రామంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న దుకాణాలను గుర్తించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఒక్కరోజు దాడులతో సరిపెట్టకుండా నిరంతర నిఘా పెట్టాలని కోరుతున్నారు. గ్రామాల్లో మద్యం అందుబాటును తగ్గించి యువతను, కూలీలను, పేద కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మహిళలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కళ్లుతెరిచి.. గ్రామాల్లో సాగుతున్న బెల్ట్ దందాపై ఉక్కుపాదం మోపుతారా? లేక అక్రమ మద్యం విక్రయాలు ఇలాగే కొనసాగుతాయా? అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
గల్లీ గల్లీలో మద్యం.. కుటుంబాల బతుకులు ఛిద్రం..!
- Advertisement -
- Advertisement -



