నవతెలంగాణ – ముధోల్
గోదావరి పుష్కరాల పనులన్నీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా బాసర ఈవో కార్యాలయంలో గోదావరి పుష్కరాల పనులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..బాసరలో పుష్కరాలకు వచ్చే భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు, వీఐపీ, వీవీఐపీ భక్తులకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరాల నిర్వహణ, భక్తుల రద్దీ నియంత్రణ, సంఖ్య లెక్కింపు అంశాల్లో కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలన్నారు.
చేపట్టే పనులను సంబంధిత ఇంజనీరింగ్ శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పనులన్నీ నాణ్యవంతంగా ఉండాలని స్పష్టం చేశారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. భక్తుల రద్దీ మేరకు తగిన రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. తగినన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, త్రాగునీటి వసతి కల్పించాలని చెప్పారు. హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం పుష్కరాల కొరకు బాసరలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని కలెక్టర్, అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, విద్యుత్ శాఖ ఎస్ఈ రమేష్, ఆర్ అండ్ బి, ఆర్డబ్ల్యుఎస్, నీటిపారుదల శాఖల ఈఈ లు సుభాష్, సందీప్, అనిల్, ఆలయ ఈవో అంజనా దేవి, తహసిల్దార్ పవన్ చంద్ర, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



