నవతెలంగాణ-భీంగల్
గ్రామపంచాయతీలలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని వేగవంతం చేయాలని మండల ప్రత్యేక అధికారి వి. విజేత అధికారులను కోరారు. శుక్రవారం భీంగల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో మండల సమావేశం మండల ప్రత్యేక అధికారి వి.విజేత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని సర్పంచులు తమ తమ గ్రామాల్లో నెలకొన్న వివిధ సమస్యలను మండల ప్రత్యేక అధికారి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన సమస్యలను వివరించారు. సర్పంచులు తెలియజేసిన సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని మండల ప్రత్యేక అధికారి సూచించారు. ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ తహసీల్దార్ కిరణ్ మండలంలోని సర్పంచులు, మండల అధికారులు పాల్గొన్నారు.



