నష్టపరిహారం ఇవ్వకుండా పనులు ప్రారంభం
ఆందోళనలతో సబ్ కలెక్టర్ ను కలిసిన బాధిత రైతులు
నవతెలంగాణ-అచ్చంపేట
ఉప్పునుంతల మండలం రాయచూరు గ్రామంలో ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం చేస్తుంది. నలుగురు దళితుల రైతులకు చెందిన ఆరు ఎకరాల భూమి కోల్పోయారు. ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా పనులు జరుగుతున్నాయి. దీంతో దళిత రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని బాధిత రైతులు సోమవారం అచ్చంపేటలో సబ్ కలెక్టర్ సలోని చాబ్రా ను కలిసి వినతిపత్రం అందజేశారు. భూమికి సంబంధించిన పాత, కొత్త పాస్‌బుక్‌లను వినతిపత్రంతో పాటు జతచేసి సమర్పించారు. ఏళ్లుగా భూములను సాగు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, పాఠశాల నిర్మాణం కోసం భూములు కోల్పోవడంతో జీవనోపాధి, కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా మారిందని రైతులు వాపోయారు.
జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, జీపీఓ అధికారులకు విన్నవించడంతో పాటు ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించినా ఇప్పటివరకు న్యాయం జరగలేదన్నారు. భూములు కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయ భూములు కేటాయించడంతో పాటు న్యాయపరమైన పరిష్కారం చూపి ఆదుకోవాలని సబ్‌కలెక్టర్‌ను కోరారు. స్పందించిన సబ్‌కలెక్టర్ సలోని ఛాబ్రా వెంటనే ఉప్పునుంతల తహసీల్దార్‌తో ఫోన్ లో మాట్లాడి దరఖాస్తుపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. 15 రోజుల్లో పూర్తి సమాచారంతో నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు రైతులు తెలిపారు. కార్యక్రమంలో బాధిత రైతులు నిరంజన్, ఆంజనేయులు, రైతు కుటుంబ సభ్యులు గ శ్రీనివాసులు, మధు పాల్గొన్నారు.



