Monday, September 21, 2026
E-PAPER
Homeఆదిలాబాద్యోగా సాధనతోనే ఏకాగ్రత

యోగా సాధనతోనే ఏకాగ్రత

- Advertisement -

కురుక్షేత్ర పాఠశాలలో యోగా శిక్షణ.. 
నవతెలంగాణ-బజార్‌హత్నూర్
విద్యార్థుల్లో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు ఏకాగ్రత, క్రమశిక్షణను అలవర్చేందుకు యోగా దోహదపడుతుందని యోగా శిక్షకురాలు మునిగెల యోగిత అన్నారు. మండల కేంద్రంలోని కురుక్షేత్ర పాఠశాలలో యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ యోగాసనాలు వేయించి, యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా యోగిత మాట్లాడుతూ.. యోగా శరీరాన్ని ఆరోగ్యంగా, దృఢంగా, చురుకుగా ఉంచడంతో పాటు మనసుకు ప్రశాంతతను అందిస్తుందని తెలిపారు.

ప్రతిరోజూ యోగా సాధన చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, శ్వాస నియంత్రణ మెరుగుపడతాయని పేర్కొన్నారు. శరీర సమతుల్యత పెరగడంతో పాటు మంచి నిద్ర, ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో చదువుపై శ్రద్ధ, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు యోగా దోహదపడుతుందని తెలిపారు. ధ్యానం సాధన ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత పెరగడంతో పాటు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చని యోగిత అన్నారు. చదువుతున్న సమయంలో దృష్టిని కేంద్రీకరించుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, శ్రద్ధను మెరుగుపరుచుకోవడంలో ధ్యానం ఉపయోగపడుతుందని వివరించారు.

క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతత, చదువుపై ఆసక్తి పెంపొందించుకోవచ్చన్నారు. విద్యార్థులు యోగా, ధ్యానాన్ని దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సబ్బిడి నవీన్, ఉపాధ్యాయులు ప్రశాంత్, నవనీత, శిరీష, నేహా, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -