నవతెలంగాణ-భీంగల్
భీంగల్ పట్టణంలోని వెజ్ అండ్ నాన్‌వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో వర్షం పడిన ప్రతిసారి బురద ఏర్పడి వ్యాపారులు, రైతులు, మార్కెట్‌కు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మార్కెట్ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. సమస్యను గత ఏడాది నుంచే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని కౌన్సిలర్ నీలం రవి తెలిపారు. మార్కెట్లో వర్షపు నీరు నిలిచి బురదగా మారడంతో నడవడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా రైతులు, పేద, మధ్యతరగతి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
తైబజార్ ద్వారా మున్సిపాలిటీకి సుమారు రూ.10.50 లక్షల ఆదాయం వస్తున్న నేపథ్యంలో మార్కెట్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పిస్తూ..వచ్చే వారం లోపు మార్కెట్లో బురద ఏర్పడకుండా చిప్స్ వేయాలని, డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని, డ్రైనేజీపై ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలని కోరారు. మార్కెట్‌కు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలను కూడా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే వారం లోపు పనులు ప్రారంభించకపోతే రైతులు, వ్యాపారులతో కలిసి తదుపరి కార్యాచరణ ప్రకటించాల్సి వస్తుందని మార్కెట్ కమిటీ ప్రతినిధులు తెలిపారు. అధికారులు స్పందించి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు.



