Tuesday, September 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉద్యోగ సంఘాల చర్చల్లో ప్రతిష్టంభన

ఉద్యోగ సంఘాల చర్చల్లో ప్రతిష్టంభన

- Advertisement -

నేటి సాయంత్రం 6 గంటలకు మరోసారి
సీఎస్ తో ఉద్యోగ సంఘాల భేటీ
ప్రధాన డిమాండ్లు ప్రస్తావించిన సంఘాలు


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు వాయిదా పడ్డాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అందుబాటులో లేకపోవడంతో మంగళవారం సాయంత్రం 6 గంటలకు సమావేశమవుదామని ఉద్యోగ సంఘాల నాయకులకు సీఎస్ సంజయ్ జాజు వెల్లడించారు. ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన ప్రధాన డిమాండ్లు ఆర్థికపరమైన అంశాలు కావటంతో భట్టి విక్రమార్కతో చర్చించాలని ఇరువురు భావిస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎస్ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమావేశమయ్యారు. ప్రధానంగా నాలుగు డిమాండ్లపై వారు చర్చించారు. సమావేశం ప్రారంభం కాగానే తొలుత నూతన ఉద్యోగ ఆరోగ్య పథకంపై చర్చించారు. దాదాపు ఒక గంటపాటు అదే అంశంపై చర్చించడంతో ఉద్యోగ సంఘాల నేతలు మిగిలిన అంశాలను కూడా చర్చించాలని కోరారు. పీఆర్సీని అమలు చేయాలనీ, పెండింగ్ ఉన్న డీఏల మంజూరు, ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ బకాయిలను చెల్లించేందుకు ప్రతి నెల రూ.2,000 కోట్లు కేటాయించడం, అందులో 50 శాతం ఉద్యోగులకు, 50 శాతం పెన్షనర్లకు చెల్లించాలని నేతలు కోరారు. అదే విధంగా సీపీఎస్ రద్దు, 2003 డీయస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్లను ముందుకు తెచ్చారు. దీనిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లి మరోసారి రాత్రి 7.30 గంటలకు చర్చిద్దామని సీఎస్ కోరారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు మరోసారి సమావేశానికి సిద్ధమవగా, డిప్యూటీ సీఎం అందుబాటులో లేని కారణంగా చర్చలను నేటి సాయంత్రం 6 గంటలకు వాయిదా వేసినట్టు సీఎస్ సమాచారాన్ని అందజేశారు. సీఎస్ సమావేశం సందర్భంగా సీపీఎస్ రద్దు విషయంలో ఎనిమిది అధికారులతో కమిటీ వేయనున్నట్టు సూత్రప్రాయంగా వెల్లడించినట్టు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. నెలాఖరు లోగా పీఆర్సీ రిపోర్ట్ ను తెప్పించుకుంటానని సీఎస్ వెల్లడించారని తెలిపారు. ఈ సమావేశంలో టీఎన్జీవోస్ అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీజీవోస్ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, పీఆర్టీయూ అధ్యక్షులు దామోదర్ రెడ్డి, టీఎన్జీవో, టీజీవో ప్రధాన కార్యదర్శులు ముజీబ్, బి.శ్యాం, డీప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి, జేఏసీ నాయకులు మధుసూదన్ రెడ్డి, కృష్ణమూర్తి, కస్తూరి వెంకటేశ్వర్లు, సోమయ్య, పి.వెంకటరెడ్డి, అబ్దుల్లా, కటకం రమేశ్, కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -