నవతెలంగాణ-హైదరాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని నవజాత శిశువుల ప్రత్యేక సంరక్షణ విభాగం(ఎస్‌ఎన్‌సీయూ)లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో తీవ్ర కలకలం నెలకొంది. అర్ధరాత్రి సమయంలో ఏసీకి సంబంధించిన సమస్యతో ప్రమాదం జరిగినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా వెల్లడించారు. ఘటన సమయంలో ఎస్‌ఎన్‌సీయూ వార్డులో మొత్తం 24 మంది నవజాత శిశువులు ఉన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే వార్డులో పొగలు వ్యాపించడంతో ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే చిన్నారులను వార్డు నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
సిబ్బంది సకాలంలో స్పందించడంతో మిగిలిన చిన్నారులను సురక్షితంగా తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఒక నవజాత శిశువు మృతి చెందగా.. మరో ముగ్గురు శిశువుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన 23 మంది శిశువులను మెరుగైన వైద్యం కోసం ఇతర వార్డులు, ఆస్పత్రులకు తరలించినట్లు సమాచారం. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్స అందిస్తున్నారు. ఘటన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా,ఎస్పీ అఖిల్ మహాజన్ రిమ్స్‌కు చేరుకుని ఎస్‌ఎన్‌సీయూ వార్డును పరిశీలించారు.
వైద్యులు, అధికారులతో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి,అవసరమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు కూడా రిమ్స్‌కు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఏసీకి సంబంధించిన సమస్యతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం ఉన్నప్పటికీ.. అసలు కారణాలు అధికారిక విచారణలో తేలాల్సి ఉంది. ఎస్‌ఎన్‌సీయూలోని ఏసీలు, విద్యుత్ వైరింగ్, ఫైర్ సేఫ్టీ, అత్యవసర తరలింపు ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. నవజాత శిశువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి,భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.



