– పలువురు నేతల నివాళి
విజయవాడ : ఐద్వా వ్యవస్థాపకురాలు నాగెళ్ల రాజేశ్వరమ్మ కుమార్తె, సీపీఐ(ఎం) అభిమాని డాక్టర్ సిరివరపు జ్యోతి (83) మంగళవారం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం కాటూరులోని స్వగృహంలో మృతి చెందారు. ఆమెకు భర్త ప్రసాద్ ఉన్నారు. తల్లిదండ్రులు రాజేశ్వరమ్మ, జానకిరామయ్య ఆశయ సాధన కోసం తుదిశ్వాస వరకూ కృషి చేశారు. జ్యోతి భౌతికకాయాన్ని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, మాజీ మంత్రి, రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్.బాబూరావు, వి.ఉమామహేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి కె.రమాదేవి, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పి.మధు, రాష్ట్ర నాయకులు కాట్రగడ్డ స్వరూపరాణి తదితరులు సందర్శించి నివాళులర్పించారు.
కన్నీటి వీడ్కోలు
జ్యోతి అంత్యక్రియలు సాయంత్రం ఆమె స్వగ్రామం కాటూరులో జరిగాయి. ముందుగా ఆమె స్వగృహం నుంచి శ్శశానవాటిక వరకు అంతిమయాత్ర సాగింది. మహిళా నేతలు డి.రమాదేవి, కాట్రగడ్డ స్వరూపరాణి, పిన్నమనేని విజయ, వీరమాచినేని జ్యోతి, చేబ్రోలు బసవమ్మ, మల్లంపల్లి జయమ్మ, బి.కీర్తి, నిమ్మాది నాగమణి, ఎన్.ప్రశాంతి తదితరులు ఆమె పాడేమోశారు.