నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ వార్డులో ఏసీ పేలి ముగ్గురు పసికందులు మృత్యువాత పడిన దుర్ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని సీపీఐ(ఎం), తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఘోరానికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సీపీఐ(ఎం) ఏరియా కమిటీ కార్యదర్శి లంకా రాఘవులు డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ, ప్రజాసంఘాల నాయకత్వ బృందం రిమ్స్ ఆస్పత్రిలోని ప్రమాద స్థలాన్ని స్వయంగా పరిశీలించింది.
అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు. రిమ్స్ ఆస్పత్రిలో ఏళ్ల తరబడి సమస్యలు తిష్టవేసినా పాలకులు వాటిని పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని నేతలు ధ్వజమెత్తారు. అధికారుల పర్యవేక్షణ లోపం, నాసిరకం పరికరాల వాడకం, అధికారుల అవినీతి వెరసి అమాయక పసిపాపల ప్రాణాలు గాల్లో కలిశాయని ఆరోపించారు. చిన్నారులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు తక్షణమే రూ. 2 కోట్ల చొప్పున పరిహారం అందించాలన్నారు. తీవ్ర అస్వస్థతకు గురై ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మిగతా శిశువుల చికిత్స ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరించి, నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ప్రమాదానికి కారకులైన అధికారులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్, టీఏజీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు సక్కు, పెందూర్ గోవింద్, సీపీఐ(ఎం) నేతలు ఆర్. మంజుల, అరీఫా పాల్గొన్నారు.



