నవతెలంగాణ-సత్తుపల్లి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం హైదరాబాదులో జరిగిన స్టేట్ హై పవర్ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాల్గొన్నారు.
ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌లతో పాటు పలువురు పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు హాజరైనట్లు ఎమ్మెల్యే రాగమయి దయానంద్ తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, వారికి అందుతున్న వివిధ ప్రభుత్వ పథకాల సమర్థవంత అమలు, వారి హక్కుల పరిరక్షణ, ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
అణగారిన వర్గాలకు పూర్తిస్థాయిలో న్యాయం అందించడం, వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడం, సంక్షేమ ఫలాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లాంటి చర్యలపై చర్చించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని, చట్టపరమైన రక్షణను క్షేత్రస్థాయిలో మరింత కఠినంగా అమలు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలను వేగంగా పరిష్కరించాలని సమావేశం తీర్మానించిందని ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్ తెలిపారు.



