Wednesday, September 23, 2026
E-PAPER
Homeమానవిగ్రామీణ బాలికల సాధికారతకై...

గ్రామీణ బాలికల సాధికారతకై…

- Advertisement -

దేశం అభివృద్ది చెందుతుందని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాము. కానీ అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యల్లో మాత్రం మార్పు లేదు. మరీ ముఖ్యంగా గ్రామీణ బాలికల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. చదువుకు, ఆర్థిక స్వేచ్ఛకు, నిర్ణయాధికారానికి చాలా దూరంగా ఉంటూ తమ జీవితాలను గడుపుతున్నారు. అలాంటి ప్రాంతాలలో హిమాచల్‌ ‌ప్రదేశ్‌‌లోని కాంగ్రా ప్రాంతం కూడా ఒకటి. అక్కడి బాలికలను నాయకులుగా తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చింది స్మిత చౌదరి. ఎన్‌లైటెన్డ్ ఇండియా ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి అమ్మాయిలకు సాధికారత కల్పిస్తోన్న ఆమె కృషి గురించి నేటి మానవిలో…

ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ సమీపంలో లంక్ అనే ఓ చిన్న గ్రామం.. అక్కడే పుట్టి పెరిగింది స్మిత చౌదరి. తన ప్రాంతంలో అబ్బాయిల పెంపకంలో, అమ్మాయిల పెంపకంలో ఎంత తేడా ఉంటుందో ప్రత్యక్షంగా చూసింది. అమ్మాయిలు చిన్న వయసులోనే చదువు మానేసి ఇంటి బాధ్యతలు తీసుకోవాలని ఆశించేవారు. అయితే అబ్బాయిలను మాత్రం కళాశాలకు వెళ్లి చదువుకొని, ఉద్యోగం చేయాలంటూ ప్రోత్సహించేవారు. ‘మా అక్కలు అయితే ‘ఇక చాలు, ఇంత వరకు చదివింది చాలు, ఇంకా చదివి ఏం చేస్తావు?’ వంటి వ్యాఖ్యలు వినేవారు. చిన్నప్పుడు నేను ఇవన్నీ వింటూ పెరిగాను’ అని ఆమె గుర్తుచేసుకుంది. అయితే స్మితకు మాత్రం మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆమె తల్లిదండ్రులు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తమ కుటుంబాన్ని షామ్లీ అనే ఒక చిన్న పట్టణానికి తరలించారు. ఈ నిర్ణయం ఆమెను ఢిల్లీలోని మిరాండా హౌస్‌లో ఉన్నత విద్యను అభ్యసించేలా, కార్పొరేట్ కమ్యూనికేషన్స్‌లో వృత్తిని చేపట్టేలా చేసింది.

​ఎన్‌లైటెన్డ్ ఇండియా ఫౌండేషన్
తాను ఓ మంచి స్థాయికి ఎదిగినప్పటికీ తన అక్కచెల్లెళ్లు గ్రామంలో తనకంటే భిన్నమైన జీవితాన్ని గడుపుతున్నారనే విషయం ఆమెను వెంటాడుతూనే ఉంది. అలాంటి సమయంలోనే 2020లో హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలో ఉపాధ్యాయురాలైన తన స్నేహితురాలు శివతి జస్టోరియాను కలవడానికి వెళ్లడం ఆమె జీవితంలో ఒక మలుపుగా మారింది. పూర్తిగా గ్రామీణ యువతులచే నడపబడే, స్వయం నిధులతో నడిచే ఒక లాభాపేక్షలేని సంస్థ ‘ఎన్‌లైటెన్డ్ ఇండియా ఫౌండేషన్’ను ప్రారంభించడానికి ఆ పర్యటన ఆమెకు, శివతికి ప్రేరణనిచ్చింది. కరోనా వచ్చినప్పుడు స్మిత అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. పాఠశాలలు మూతపడటం, ఇంటి నుంచే ఉద్యోగం చేయడం వంటి అవకాశాలను ఉపయోగించుకుని, శివతితో కలిసి పిల్లలతో సమయం గడిపింది.

​నిర్ణయాధికారం లేదు
కరోనా సమయంలో చాలా ఇళ్లలో కేవలం ఒకే ఒక స్మార్ట్‌ఫోన్ ఉండేది. ఇంట్లో కొడుకు, కూతురు ఉంటే ఆన్‌లైన్ తరగతుల కోసం అబ్బాయికి ఫోన్ ఇచ్చేవారు. అమ్మాయిని ఇంటి పనులు, వ్యవసాయ పనులు, తమ్ముళ్లు, చెల్లెళ్లను చూసుకోవడం వంటి పనులకు కేటాయించేవారు. అన్ని పనులు చేస్తున్నప్పటికీ వారికి నిర్ణయాధికారం ఉండేది కాదు. ‘ఆ సమయంలో వారికి కేవలం పాఠ్యపుస్తకాలు ఇస్తే సరిపోదని మేము గ్రహించాం. వారిలో ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించాల్సి ఉందనే నిర్ణయానికి వచ్చాం’ అని స్మిత తెలిపింది. మొదట్లో వారి లక్ష్యం చిన్నదిగా ఉండేది. మొదట ఆత్మవిశ్వాసం, ఆ తర్వాత చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించడం మొదలుపెట్టారు.

​మహిళా నాయకులు
‘వారు ప్రతి విషయంలో స్పందించాలనీ, కాంగ్రా కొండ ప్రాంతాలలో సర్వసాధారణంగా ఉండే రవాణా, పాడైన రోడ్లు వంటి రోజువారీ సమస్యలపై గ్రామ పంచాయతీలో తమ సమస్యలను లేవనెత్తాలని నేను కోరుకున్నాను’ అని ఆమె అంటుంది. అందుకే ఆ సంస్థ గణితం, ఇంగ్లీష్, సైన్స్, కోడింగ్‌లలో శిక్షణా తరగతులతో పాటు, క్రీడా శిక్షణా కార్యక్రమాలు, జీవన నైపుణ్యాల కార్యకలాపాలను నిర్వహించింది. ‘మేము ఈ బాలికలకు, యువతులకు శిక్షణ ఇస్తున్నప్పుడు, వారే స్వయంగా నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. ఇది మమ్మల్ని మరింత ప్రోత్సహించింది. వారి నుండి మేమూ నేర్చుకోవచ్చని, మా శిక్షణా కేంద్రాలను విస్తరించవచ్చని అనిపించింది. ఎందుకంటే ఈ మహిళా నాయకులు భవిష్యత్తులో తమ సొంత గ్రామాలలో, సమాజాలలో మరింత మంది పిల్లలకు బోధిస్తారు’ అని స్మిత అంటుంది.

​అమ్మాయిలకు స్వేచ్ఛనిస్తేనే…
సిధ్‌పూర్, రక్కర్, మొహాలీలలో శిక్షణా కేంద్రాలను స్థాపించి, కుటుంబాలను, ముఖ్యంగా బాలికలు, వయోజన మహిళలతో పరిచయాలు పెంచుకున్నారు. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే లాక్‌డౌన్ తర్వాత అమ్మాయిలను చాలా మంది చదువు మాన్పించడం మొదలుపెట్టారు.17 లేదా 18 ఏళ్ల వయసున్న కొందరికి పెళ్లి చేసుకోమని చెప్పారు. అమ్మాయిలకు శిక్షణనిచ్చి, స్వేచ్ఛనిచ్చిన తర్వాత, వారు కేంద్రాలను స్వతంత్రంగా నడపగలరని ఆ సంస్థ అర్థం చేసుకుంది. వారికి స్టైపెండ్ కూడా ఇచ్చారు. ఇప్పటివరకు ఈఐఎఫ్‌ ఆ ప్రాంతంలోని 46కు పైగా గ్రామాలలో 800కు పైగా కుటుంబాలతో సంప్రదింపులు జరిపింది. 3,500 మంది పిల్లలను ప్రభావితం చేసింది. వీరిలో 70% మంది బాలికలు ఉన్నారు. ఈ ఫౌండేషన్‌లో ప్రస్తుతం ఐదుగురు గ్రామ స్థాయి కమ్యూనిటీ నాయకులు, ఒక ఫీల్డ్ అసోసియేట్ ఉన్నారు. వీరందరూ దాని కార్యక్రమాల ద్వారానే శిక్షణ పొందారు.

​‌సమస్యలు అర్థం చేసుకునేందుకు
పాఠశాల తర్వాత జరిగే ఈ సమావేశాలలో వచ్చే రోజువారీ ఫిర్యాదులకు ఈఐఎఫ్‌ స్పందించే విధానమే దాన్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. పిల్లలు పాడైన రోడ్డు, ఎండిపోయిన కుళాయి, సరిగా పని చేయని ఇంటర్నెట్ గురించి చెప్పినప్పుడు వాటిని సంస్థ నమోదు చేస్తుంది. ‘ఇటీవల మేము స్థానిక పాఠశాలల్లో విద్యార్థులకు, బాలికలకు వారి హక్కులు, విధులు, స్థానిక ప్రభుత్వం ఎలా పనిచేస్తుందనే దాని గురించి బోధించడానికి ఒక పౌర, పరిపాలన వర్క్‌షాప్‌ను నిర్వహించాము. ఇది వారి గ్రామాలు, కమ్యూనిటీలలో వారు చూసే సమస్యలను అర్థం చేసుకోవడానికి, స్పందించడానికి ఉపయోగపడుతుంది’ అని స్మిత అంటుంది. సంస్థ ఇటీవల కాంగ్రాలోని 21 గ్రామాలలో, మహిళా నాయకుల నేతృత్వంలో రెండు సర్వేలను పూర్తి చేసి, ఆ రెండు నివేదికలను జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమర్పించింది.

​ఆన్‌లైన్ భద్రతపై…
సంస్థ కార్యకలాపాలు పాఠశాల ప్రాంగణాలకే పరిమితం కాకుండా అంగన్‌వాడీల వరకు విస్తరించాయి. ఆన్‌లైన్ మోసాలు లేదా ఓటీపీ స్కామ్‌ల గురించి చాలా మందికి తెలియదని ఒక సర్వేలో తేలిన తర్వాత, మారుమూల గ్రామాలలో బాలికల సంరక్షకుల కోసం డిజిటల్-భద్రతా తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం కౌమార బాలికలు తమ స్క్రీన్ సమయం గురించి మరింత అవగాహన పెంచుకోవడానికి, ఆన్‌లైన్ భద్రతను బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడింది.

​సవాళ్లు.. భవిష్యత్ కార్యాచరణ
​ఈఐఎఫ్‌ తన డిజిటల్-భద్రతా తరగతులను పాఠశాలలకు తీసుకువెళ్లడంలో ప్రతిఘటనలు ఎదుర్కొంది. కొన్ని పాఠశాలలు మొదట్లో వాటిని నిర్వహించడానికి విముఖత చూపాయి. దీన్ని పరిష్కరించడానికి సంస్థ కాంగ్రాలోని జిల్లా మేజిస్ట్రేట్, ఏడీసీ, జిల్లా విద్యా అధికారిని సంప్రదించి, తమ పరిశోధనల ఫలితాలను వారితో పంచుకుని, తరగతులు నిర్వహించడానికి అధికారిక అనుమతి కోరింది. మొదట్లో నిరాకరించిన పాఠశాలలు చివరకు వాటిని నిర్వహించడానికి అంగీకరించాయి. ఈ ఫౌండేషన్ తన కార్యకలాపాలను ఇతర గ్రామాలకు, అలాగే ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు కూడా విస్తరించాలని ఆశిస్తుంది.

ఫైటర్ పైలట్ అవుతాను
ప్రియాంక 2021లో ఎన్‌లైటెన్డ్ ఇండియా ఫౌండేషన్‌లో చేరినప్పుడు ఆమె వయస్సు 17. ఒక నిర్మాణ కార్మికుడి కుమార్తె అయిన ఆమె, పదవ తరగతిలో 93% మార్కులు సాధించినప్పటికీ తన అభిప్రాయాన్ని ముందుకు తీసుకురావడానికి సంకోచించింది. ఈఐఎఫ్‌ ఆమెకు విద్యాపరంగా, ఆర్థికంగా మద్దతు ఇవ్వడంతో పాటు, తన చదువుతో పాటు గ్రామాలలో కార్యక్రమాలకు నాయకత్వం వహించే అవకాశాలను కూడా కల్పించింది. ఆమె గణితం, భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ చదువుతూనే విద్యా కార్యక్రమాలను నిర్వహించడం, క్షేత్ర పరిశోధనలు చేయడం, పంచాయతీ ప్రతినిధులతో కలిసి పనిచేయడం వంటి బాధ్యతలను స్వీకరిస్తుంది. ప్రస్తుతం ఆమె కాంగ్రా జిల్లాకు ఈఐఎఫ్‌ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా, సుమారు 50 గ్రామాలలో పరిశోధన, పరిపాలన కార్యక్రమాలను సమన్వయం చేస్తుంది. భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్ కావాలన్నది ప్రియాంక లక్ష్యం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -