అమెరికా ఆదేశాలతో మోడీ సర్కార్ దూకుడు
డిజిటల్ చెల్లింపుల నిర్వహణకు
ఖర్చు అవసరమంటున్న కేంద్రం
రాజకీయంగా పెద్ద సవాలే : విశ్లేషకులు
దేశంలోని చిరు వ్యాపారులపై కొత్త భారం
ప్రభుత్వ నిర్ణయంపై వారిలో ఆగ్రహం
న్యూఢిల్లీ : యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఆర్థిక, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. యూపీఐ వ్యవస్థను నిర్వహించడం, భద్రత కల్పించడం, సాంకేతికంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం కోసం భారీగా ఖర్చు అవుతోందని ప్రభుత్వం చెప్తోంది. వ్యక్తుల మధ్య జరిగే సాధారణ లావాదేవీలకు చార్జీ ఉండదని, పరిమిత స్థాయిలో కొన్ని వ్యాపార లావాదేవీలకే ఎండీఆర్ వర్తిస్తుందని తన నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తోంది. అయితే దేశంలోని చిరు వ్యాపారులు, చిల్లర వర్తకులు మాత్రం మోడీ సర్కారుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
వాస్తవానికి 2016 ఏప్రిల్‌లో యూపీఐ ప్రారంభమైనప్పుడు లావాదేవీలపై చార్జీలు ఉండేవి. 2020 జనవరి నుంచి యూపీఐని ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. కరోనా కాలంలో, ఆ తర్వాత డిజిటల్ చెల్లింపుల వినియోగం భారీగా పెరిగింది. ప్రజలు నగదుకు బదులుగా మొబైల్ ద్వారా చెల్లింపులు చేయడం సాధారణమైంది. చిన్న మొత్తాల చెల్లింపులు కూడా సులభంగా జరిగే పరిస్థితి ఏర్పడింది. యూపీఐని నిర్వహించడం, సురక్షితంగా ఉంచడం, కొత్త సాంకేతికతలకు అనుగుణంగా మార్పులు చేయడం వంటి వాటికి నిరంతరం వ్యయవుతుందని కేంద్రం వాదిస్తోంది. అందువల్ల కొంతమంది వ్యాపారుల లావాదేవీలపై పరిమిత ఛార్జీ విధించడం ద్వారా ఆ ఖర్చులో కొంత భాగాన్ని భర్తీ చేయాలన్న వాదనతో తన నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు ప్రయత్నిస్తోంది.
అయితే యూపీఐపై చార్జీ విధించడంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఉచితంగా యూపీఐ అందుబాటులో ఉండటం వల్ల నగదు వినియోగం తగ్గి, డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. యూపీఐ వినియోగం మరింత విస్తరిస్తే దాని ద్వారా ఏర్పడే ఆర్థిక ప్రయోజనాలు ప్రభుత్వ సబ్సిడీ కంటే ఎక్కువగా ఉండవచ్చని నిపుణులు చెప్తున్నారు. యూపీఐని దేశంలో విస్తృతంగా వాడటంతో ఈ విధానాన్ని ఇతర దేశాలు కూడా స్వీకరించాయి. అయితే మోడీ సర్కారు విధిస్తున్న చార్జీల నిర్ణయానికి రాజకీయ కోణం కూడా ఉంది. గతంలో ఆర్థికంగా ప్రయోజనకరమైనవిగా భావించిన భూసేకరణ, వ్యవసాయ మార్కెట్, కార్మిక రంగ సంస్కరణలు వంటి అంశాల్లో రాజకీయ వ్యతిరేకత కారణంగా కేంద్రం వెనుకడుగు వేసిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయంగా సున్నితమైన నిర్ణయాలను అమలు చేయడంలో తరచూ జాగ్రత్త వహించింది.
అయితే యూపీఐపై ఎండీఆర్ విషయంలో మాత్రం చిన్న వ్యాపారులు, చిల్లర వర్తకుల నుంచి ఇప్పటికే వ్యతిరేకత వస్తోంది. అయినప్పటికీ మోడీ సర్కారు అదేమీ పట్టనట్టుగా ముందుకు సాగుతోంది. యూపీఐపై చార్జీలను ఆరెస్సెస్‌కు అనుబంధ సంస్థగా చెప్పబడే స్వదేశీ జాగరణ్ మంచ్ కూడా వ్యతిరేకించింది. దీంతో ఈ నిర్ణయం కేంద్రంలోని మోడీ సర్కారు ఎదుర్కొనే రాజకీయ ఒత్తిడికి ఒక పరీక్షగా మారిందని విశ్లేషకులు చెప్తున్నారు.
యూపీఐపై చార్జీ అమల్లోకి వస్తే దాని ప్రభావం వినియోగదారుల కంటే వ్యాపారులపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్ణయాన్ని కొనసాగిస్తే యూపీఐ నిర్వహణకు అయ్యే ఖర్చును వినియోగదారులపై కాకుండా కొంతమంది వ్యాపారుల ద్వారా భర్తీ చేయాలన్న విధానానికి ప్రాధాన్యం ఇచ్చినట్టవుతుంది. ఒకవేళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే చిన్న వ్యాపారుల ప్రయోజనాలు, రాజకీయ ప్రభావాలను పరిగణనలోకి తీసుకున్నట్టవుతుంది. అందువల్ల యూపీఐపై ఎండీఆర్ అంశం కేవలం డిజిటల్ చెల్లింపుల ఛార్జీలకే పరిమితం కాకుండా.. ప్రజా డిజిటల్ మౌలిక వసతుల నిర్వహణ ఖర్చును ఎవరు భరించాలి, ఉచిత సేవలకు ప్రభుత్వం ఎంతకాలం సబ్సిడీ ఇవ్వాలి, వ్యాపారులపై అదనపు భారం ఎంతవరకు ఉండాలి అనే ప్రశ్నలను కూడా ముందుకు తెస్తోంది.
యూపీఐపై చార్జీతో రగడే..
- Advertisement -
- Advertisement -



