50 మీటర్ల పరిధిలో అమ్మకాలపై కేంద్రం కసరత్తు
పిల్లల ఆరోగ్యమే లక్ష్యమంటున్న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ
జీవనోపాధిపై ప్రభావం ఉంటుందంటున్న వ్యాపారులు
చిప్స్, కూల్‌డ్రింక్స్ నుంచి పిజ్జా, బర్గర్ల వరకు ఆంక్షల పరిధిలోకి?
పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం మరో కీలక చర్యకు సిద్ధమవుతోంది. దేశంలోని సుమారు 15 లక్షల పాఠశాలల చుట్టూ 50 మీటర్ల పరిధిలో అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర ఉన్న ఆహార పదార్థాల విక్రయాలను నియంత్రించే ప్రతిపాదన ముందుకు వచ్చింది. పిల్లల్లో పెరుగుతున్న అధిక బరువు, ఊబకాయాన్ని అడ్డుకోవడమే లక్ష్యమని ఆహార భద్రతా సంస్థ చెప్తున్నప్పటికీ.. పాఠశాలల చుట్టూ చిన్న దుకాణాలు, హోటళ్లు, ఫుడ్ స్టాళ్లపై ఈ నిబంధన ప్రభావం ఎలా ఉంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా తమ జీవనోపాధిపై ఇది ప్రభావం చూపుతుందని చిరు వ్యాపారులు వాపోతున్నారు.
న్యూఢిల్లీ: పిల్లలకు జంక్‌ఫుడ్ దూరం చేయడానికి కేంద్రం కఠిన నిబంధనల దిశగా అడుగులు వేస్తోంది. అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర ఉన్న ఆహారం (హెచ్‌ఎఫ్‌ఎస్‌ఎస్)ను పాఠశాల ల్లోనే కాకుండా వాటి చుట్టుపక్కల 50 మీటర్ల పరిధిలో కూడా నియంత్రించే ప్రతిపాదనపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) కసరత్తు చేస్తోంది. ఆగస్టులో దీనికి సంబంధించిన ముసాయిదా నిబంధనలను విడుదల చేసి ప్రజల నుంచి అభిప్రాయాలను కోరింది.
చిప్స్ నుంచి పిజ్జా వరకు
ప్రతిపాదిత నిబంధనల ప్రభావం పాఠశాలల సమీపంలోని వేలాది చిన్న దుకాణాలపై పడే అవకాశం ఉంది. చక్కెర కలిగిన శీతల పానీయాలు, చిప్స్, చాక్లెట్లు, నూడుల్స్, సమోసాలు, పిజ్జాలు, బర్గర్లు వంటి అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర కలిగిన ఉత్పత్తులు నియంత్రణ పరిధిలోకి రావచ్చు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రతిపాదన లో హెచ్‌ఎఫ్‌ఎస్‌ఎస్ ఆహారాన్ని నిర్ణయించేందుకు కొవ్వు, అదనపు చక్కెర, ఉప్పు స్థాయిలకు ప్రమాణాలను కూడా పేర్కొంది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజిత్ పున్హానీ ప్రకారం.. చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడమే ఈ చర్య ఉద్దేశమని తెలిపారు. కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీ విధానాలను మార్చుకునేలా ప్రోత్సహిం చడం కూడా లక్ష్యాల్లో ఒకటని ఆయన చెప్పారు.
ఊబకాయం పెరుగుతున్న వేళ
భారత్‌లో పిల్లలు, యువతలో అధిక బరువు, ఊబకాయం పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య ప్రాధాన్యం సంతరించుకుంది. రాయిటర్స్ నివేదించిన వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ గణాంకాల ప్రకారం.. 5 నుంచి 19 ఏండ్ల మధ్య అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్న పిల్లల సంఖ్య 2015లో 2.8 కోట్ల నుంచి 2025 నాటికి 4.1 కోట్లకు పెరిగింది. 2040 నాటికి ఇది 5.6 కోట్లకు చేరవచ్చని అంచనా. అయితే సమస్యను కేవలం పాఠశాలల చుట్టూ ఆహార విక్రయాలను నియంత్రించడం ద్వారా పరిష్కరించగలమా అన్నది మరో ప్రశ్న. పాఠశాలల్లో పోషకాహారం అందించడం, పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంచడం, శారీరక వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వడం వంటి చర్యలు కూడా సమాంతరంగా అవసరమని ఆరోగ్య నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు.
చిన్న దుకాణాలపై భారం?
పాఠశాలలు సాధారణంగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఉంటాయి. వాటి చుట్టూ ఉన్న దుకాణాలు విద్యార్థులకే కాకుండా స్థానిక ప్రజలకు కూడా వస్తువులు విక్రయిస్తుంటాయి. దీంతో 50 మీటర్ల నిబంధనను అమలు చేయడం ఆచరణలో కష్టమవుతుందని వ్యాపార వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పరిశ్రమ వర్గాల అభిప్రాయం ప్రకారం.. అనేక పాఠశాలలు రద్దీగా ఉండే మార్కెట్ల మధ్యలో ఉన్నందున ఈ నిబంధన అమలుతో వ్యాపారం, జీవనోపాధిపై ప్రభావం పడే అవకాశం ఉంది. పాఠశాలల లోపల మాత్రమే ఆంక్షలు విధించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.
మహారాష్ట్రలో ఇప్పటికే కఠిన చర్యలు
మహారాష్ట్రలో పాఠశాలలకు 50 మీటర్ల పరిధిలోని దుకాణాల్లో హెచ్‌ఎఫ్‌ఎస్‌ఎస్ ఉత్పత్తుల విక్రయాలపై మరింత కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్టు రాయిటర్స్ తెలిపింది. అక్కడ తనిఖీల్లో 50 మీటర్ల పరిధిలో 133 దుకాణాల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించగా.. 51 దుకాణాలకు వ్యాపారం నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు.
విదేశాల్లోనూ ఆంక్షలు
చిలీ 2016లో జంక్‌ఫుడ్‌పై హెచ్చరిక లేబుళ్లు, పాఠశాలల్లో విక్రయాలు, ప్రచారంపై కఠిన నిబంధనలు అమలు చేసింది. ఆ నిబంధనల తర్వాత ఆహార సంస్థలు అనేక ఉత్పత్తుల తయారీ విధానాలను మార్చుకున్నాయి. లాన్సెట్ అధ్యయనం ప్రకారం.. చట్టం అమలైన 18 నెలల తర్వాత బాలికల్లో అధిక బరువు వచ్చే అవకాశం 2.85 శాతం, బాలురలో 2.4 శాతం తగ్గినట్టు గుర్తించారు.
ఆరోగ్య రక్షణ.. అమలే అసలు సవాలు
పిల్లల ఆరోగ్యాన్ని రక్షించేందుకు జంక్‌ఫుడ్ నియంత్రణ అవసరమనే వాదనకు బలం ఉన్నప్పటికీ.. ఆంక్షలను అమలు చేసే విధానం కీలకం. పాఠశాలల చుట్టూ ఉన్న చిన్న వ్యాపారుల జీవనోపాధికి నష్టం కలగకుండా, పిల్లలకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ ఆహారం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నిబంధనలు ఎవరిపై ఎలా అమలు చేయాలి? ఉల్లంఘనలను ఎవరు తనిఖీ చేయాలి? చిన్న వ్యాపారులకు ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వాలి? అనే అంశాలపై స్పష్టత అవసరమని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి సంబంధిం చిన ప్రతిపాదన ప్రస్తుతం ముసాయిదా దశలోనే ఉంది. తుది నిబంధనలు, వాటి అమలు విధానం ఇంకా స్పష్టంగా ఖరారు కావాల్సి ఉంది.



