నెలలోగా ప్రభుత్వాస్పత్రుల్లో ఫైర్, ఎలక్ర్టికల్, స్ర్టక్చరల్ ఆడిటింగ్
ఆరు నెలలకోసారి విధిగా నిర్వహించాలి
అందుకోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి
జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మెన్‌గా, రాష్ట్ర స్థాయిలో ఆరోగ్య శాఖ మంత్రి చైర్మెన్‌గా కమిటీలు : సమీక్షలో మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రతి ఆస్పత్రి కూడా ఫైర్, ఎలక్ర్టికల్ ఎక్విప్‌మెంట్ మెయింటనెన్స్‌కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించేలా, అన్ని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లోనూ ఫైర్ సేప్టీ ప్రమాణాలను పటిష్టంగా అమలు చేసేలా సమగ్ర గైడ్‌లైన్స్ రూపొందించాలని అధికారులను రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. అగ్ని ప్రమాదాల నివారణతో పాటు అత్యవసర పరిస్థితుల్లో రోగులు, సిబ్బందిని సురక్షితంగా తరలించేలా వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో నెల రోజుల్లో ఫైర్, ఎలక్ట్రికల్, స్ట్రక్చరల్ సేఫ్టీల ఆడిట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆస్పత్రుల్లో ఫైర్, ఎలక్ట్రికల్, స్ట్రక్చరల్ సేఫ్టీలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇక నుంచి ఫైర్, ఎలక్ర్టికల్ సేఫ్టీలపై ప్రతి ఆరు నెలలకోసారి, భవనాల నిర్మాణ పటిష్టతపై ఏడాదికోసారి ఆడిట్‌లు నిర్వహించాలనీ, ఆడిట్‌లో గుర్తించిన లోపాలను నివేదికలకే పరిమితం చేయకుండా నిర్దిష్ట టైమ్‌బాండ్‌తో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సమగ్ర గైడ్‌లైన్స్, చెక్‌లిస్ట్‌తో జీవో
ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించి అన్ని అంశాలను కవర్ చేసేలా సమగ్ర గైడ్‌లైన్స్, స్టాండర్డ్ చెక్‌లిస్ట్‌తో ప్రత్యేక జీవో జారీకి వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేయాలని మంత్రి ఆదేశించారు.
ఫైర్ అలారం, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్స్, హైడ్రెంట్స్, స్ప్రింక్లర్ సిస్టమ్, ఫైర్ వాటర్ లైన్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, ఎమర్జెన్సీ లైటింగ్, ఎలక్ట్రికల్ ప్యానెల్స్, వైరింగ్, డీజీ సెట్లు, ఏసీ యూనిట్లు, ఆక్సిజన్ సప్లై వ్యవస్థలు తదితర అంశాలతో పాటు ఎమర్జెన్సీ రెస్పాన్స్, ఎవాక్యుయేషన్ ప్రోటోకాల్స్‌ను కూడా చెక్‌లిస్ట్‌లో చేర్చాలని సూచించారు. ప్రతి ఆస్పత్రిని కూడా సెన్సిటివ్, నాన్-సెన్సిటివ్ జోన్లుగా విభజించాలనీ, సెన్సిటీవ్ జోన్లలో ప్రత్యేక భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని ఆదేశించారు. ఆస్పత్రి సిబ్బందికి క్రమం తప్పకుండా మాక్ డ్రిల్స్ నిర్వహించి శిక్షణ ఇవ్వాలని సూచించారు.
జిల్లా స్థాయిలో మల్టీ డిపార్ట్‌మెంటల్ కమిటీలు…రాష్ట్ర స్థాయిలో మానిటరింగ్ కమిటీ
ఫైర్, ఎలక్ట్రికల్, స్ట్రక్చరల్ సేఫ్టీ అంశాలపై జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మెన్‌గా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలనీ, అందులో డీఎంహెచ్‌వో, ఎస్‌ఈ, డీఎఫ్‌ఓ, అగ్నిమాపక, ఆర్‌అండ్‌బీ శాఖల జిల్లా అధికారులు భాగస్వాములై ఆస్పత్రులను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో ఆరోగ్యశాఖ మంత్రి చైర్మెన్‌గా ఆయా శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పరిస్థితి, ఆడిట్‌ల పురోగతి, గుర్తించిన లోపాలు, వాటి పరిష్కారం, అత్యవసర అవసరాలకు సంబంధించిన నివేదికలను రాష్ట్ర స్థాయి కమిటీ సమీక్షించేలా వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు.ప్రతి ఆస్పత్రి కూడా అగ్నిమాపక, విద్యుత్ పరికరాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించేలా మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, టీజీ ఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేశ్ పాటిల్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



