Homeజాతీయంయువతకు ఉద్యోగం ఎక్కడ?

యువతకు ఉద్యోగం ఎక్కడ?

- Advertisement -

25 శాతం మందికి చదువు లేదు.. ఉద్యోగం లేదు
దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లో తీవ్ర పరిస్థితి
తెలంగాణలోనూ ఆందోళనకర గణాంకాలు
మహిళలపై ఇంటి పనుల భారం
అవకాశాలకు దూరమవుతున్న యువతః పీఎల్‌ఎఫ్‌ఎస్‌ గణాంకాలు
‘వికసిత్‌ భారత్‌’ నినాదాల మధ్య ఉపాధి సంక్షోభంపై ప్రశ్నలు

న్యూఢిల్లీ : దేశ యువత భవిష్యత్తుపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి మరోసారి గణాంకాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. 2025 జిల్లా స్థాయి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్ఎస్‌) ప్రకారం దేశంలోని దాదాపు 250 జిల్లాల్లో 15–29 ఏండ్ల యువతలో 25 శాతం మందికి పైగా ఉద్యోగం, విద్య, వృత్తి శిక్షణ… ఈ మూడింటిలో ఏదీ చేయడం లేదు (నాట్‌ ఇన్‌ ఎంప్లాయిమెంట్‌, ఎడ్యుకేషన్‌ ఆర్‌ ట్రైనింగ్‌ – నీట్‌). కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ నివేదిక దేశంలో యువతకు విద్య తర్వాత ఉపాధి అవకాశాల పరిస్థితిపై ఆందోళన కలిగిస్తోంది.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దారుణం
దేశాన్ని ‘వికసిత్‌ భారత్‌’గా తీర్చిదిద్దుతామని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెప్తున్నప్పటికీ.. యువతలో గణనీయమైన వర్గం ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ లేదా విద్యకు దూరంగా ఉండటం ఉపాధి విధానాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా బీహార్‌, యూపీ హర్యానా, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో దాదాపు మూడింట రెండు వంతుల జిల్లాల్లో యువతలో కనీసం నాలుగో వంతు నీట్‌ వర్గంలో ఉన్నట్టు సర్వే వెల్లడించింది. తెలంగాణ, ఏపీ, ఒడిశా, అసోం, రాష్ట్రాల్లోనూ దాదాపు సగం జిల్లాల్లో 15–29 ఏండ్ల యువతలో 25 శాతం మంది నీట్‌ వర్గంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 600 జిల్లాలను ఈ నివేదిక పరిశీలించింది. కొన్ని సందర్భాల్లో పక్కపక్కనే ఉన్న జిల్లాలను కలిపి ఒక యూనిట్‌గా పరిగణించారు.

ఆందోళనకరంగా యువ మహిళల పరిస్థితి
ఇక్కడ ‘నీట్‌’ అంటే ఉద్యోగం, విద్య, శిక్షణలో లేని యువత అని అర్థం. అయితే వీరిలో కొందరు ఇంటి పనులు, పిల్లలు, కుటుంబ సభ్యుల సంరక్షణ వంటి వేతనాలకు నోచుకోని పనుల్లో ఉన్నారు. మరికొందరు సరైన ఉద్యోగం దొరకక ఉద్యోగాన్వేషణనే మానేస్తున్నారు. అయితే యువతలో ఇంత పెద్ద సంఖ్యలో విద్య, ఉపాధి, శిక్షణకు వెలుపల ఉండటం మాత్రం దేశంలో ఉపాధి అవకాశాలపై పదునైన ప్రశ్నను ముందుకు తెస్తోంది. ముఖ్యంగా యువ మహిళల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. సర్వే చేసిన జిల్లాల్లో దాదాపు మూడు వంతుల జిల్లాల్లో యువ మహిళల ‘నీట్‌’ రేటు 25 శాతానికి మించి ఉంది. ఇంటి పనులు, కుటుంబ సంరక్షణ బాధ్యతలు మహిళలను విద్య, ఉద్యోగాల నుంచి దూరం చేస్తున్నాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. దేశంలో యువతకు నైపుణ్యాలు, ఉద్యోగాలు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం ‘స్కిల్ ఇండియా’, ‘వికసిత్ భారత్‌’ వంటి కార్యక్రమాలను గొప్పగా ప్రచారం చేస్తోంది. కానీ కేంద్ర ప్రభుత్వ సర్వేలోనే తేలిందేంటంటే పెద్ద సంఖ్యలో యువత విద్య, ఉద్యోగం, శిక్షణకు దూరంగా ఉండటం. ఇప్పుడిది ప్రభుత్వ విధానాల అమలుపై చర్చకు దారితీస్తోంది.

ఇతర నివేదికల్లోనూ ‘నిరుద్యోగమే’
ఈ ఒక్క సర్వేనే కాదు.. గతంలో నిటి ఆయోగ్ నివేదిక సైతం 15–29 ఏండ్ల వయసులో సుమారు 8.7 కోట్ల మంది యువత చదువు, ఉద్యోగం, శిక్షణలో లేరని వెల్లడించడం విదితమే. అయితే వీరందరినీ నేరుగా ‘నిరుద్యోగులు’గా పిలవడం సరికాదని కేంద్ర ప్రభుత్వం అప్పట్లో సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026’ నివేదిక కూడా 15–25 ఏండ్ల యువతలో దాదాపు 40 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని పేర్కొంది. అదే నివేదిక డిగ్రీ పూర్తిచేసిన వారిలో కేవలం సుమారు ఏడు శాతం మందికే ఏడాది లోపు శాశ్వత జీతభత్యాల ఉద్యోగం లభించిందని వివరించింది.

యువశక్తిని వినియోగించుకోవడంలో కేంద్రం విఫలం
వాస్తవానికి భారత్‌కు ఉన్న బలం యువతే. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే అధిక సంఖ్యలో యువత ఉన్నది. దేశంలో యువత సంఖ్యే అతిపెద్ద బలమని కేంద్రం పదేపదే చెప్తున్నప్పటికీ.. వారికి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమవుతోంది. వారి మేధస్సు, శక్తిని వినియోగించుకోవడంలో మోడీ సర్కారు పూర్తిగా విఫలమవుతోంది. యువతకు తగిన విద్య, నైపుణ్యం, స్థిరమైన ఉపాధి అందని కారణంగా దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ పైనా పడుతోంది. ఉద్యోగాల కోసం ఏండ్ల తరబడి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత, తాత్కాలిక పనులతో జీవిస్తున్న పట్టభద్రులు, ఉద్యోగాల కోసం వలస వెళ్తున్న యువత సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ గణాంకాలు మోడీ సర్కారు ఉపాధి విధానాలపై సమీక్ష అవసరమని సూచిస్తున్నాయి.

ఉపాధి కల్పనే కీలకం
‘వికసిత్ భారత్’ అంటే పెద్ద ప్రాజెక్టులు, పెట్టుబడులు, మౌలిక వసతులు కాదనీ, యువతకు చదువు పూర్తయ్యాక గౌరవ ప్రదమైన, స్థిరమైన ఉపాధి లభించడం కూడా అభివృద్ధికి కీలక ప్రమాణమేనని మేధావులు, నిపుణులు చెప్తున్నారు. దేశంలో దాదాపు 250 జిల్లాల్లో నాలుగో వంతుకుపైగా యువత ఉద్యోగం, విద్య, శిక్షణకు వెలుపల ఉన్న పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుం దన్నది. ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -