Homeజాతీయంజ్ఞానేశ్‌కుమార్‌ను వెంటనే తొలగించాలి

జ్ఞానేశ్‌కుమార్‌ను వెంటనే తొలగించాలి

- Advertisement -

​‌సర్‌‌ను నిలిపివేసి.. తొలగించిన ఓటర్ల హక్కును పునరుద్ధరించాలి
సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐఎంఎల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ఎంఎ బేబీ, డి.రాజా, దీపాంక‌ర్ భ‌ట్టాచార్య‌

నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వెంటనే పదవి నుంచి తొలగించాలని వామపక్ష పార్టీల నేత‌లు డిమాండ్‌ చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, ఈ ప్రక్రియలో అన్యాయంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పునరుద్ధరించాలని కోరారు. గురువారం నాడిక్క‌డ ‌సీపీఐ(ఎం) కేంద్ర కార్యాల‌యం (ఎకె గోపాల‌న్ భ‌వ‌న్‌)లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ(ఎంఎల్‌) ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య మాట్లాడారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను, ప్రజాస్వామ్య పద్ధతిలో దాని కార్యకలాపాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని మార్చాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు గతంలో సూచించిన విధంగా ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ ద్వారా ఎన్నికల కమిషనర్లను నియమించే విధానాన్ని తీసుకురావాలని కోరారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్‌తో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్న‌ట్టు వామపక్ష నేతలు ప్రకటించారు. భగత్‌సింగ్‌ జయంతి సెప్టెంబర్‌ 26 నుంచి మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్‌ 2 వరకు వారం రోజులపాటు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం కోసం భగత్‌సింగ్‌, మహాత్మాగాంధీ నిరంతరం పోరాడారని గుర్తుచేశారు. బీజేపీయేతర లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలతోపాటు పౌరసంఘాలు, ప్రజలు పెద్దఎత్తున ఈ ఆందోళనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈసీ విశ్వసనీయతపై తీవ్ర ప్రశ్నలు
సీఈసీ జ్ఞానేశ్‌‌కుమార్‌ నేతృత్వంలోని ఎన్నికల సంఘం పనితీరుపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయని వామపక్ష నేతలు తెలిపారు. సమస్య కేవలం ‌‘సర్‌‌’కే పరిమితం కాలేదని, ఎన్నికల సంఘం విశ్వసనీయతే ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ఓటర్ల జాబితాలో పేర్ల చేర్పు, తొలగింపుతోపాటు సర్‌‌కు సంబంధించిన అంశాలపై ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు 14 సార్లు తమ విభేదాలను నమోదు చేసినట్టు వారు తెలిపారు. క‌మిష‌న‌ర్ల‌ అనుమతి లేకుండానే సీఈసీ నిర్ణయాలు తీసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు. ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు చాలాకాలంగా వ్యక్తం చేస్తున్న అనుమానాలను తాజా పరిణామాలు బలపరు స్తున్నాయని వామపక్ష నేతలు పేర్కొన్నారు. సర్‌, ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియలు పారదర్శకంగా, వికేంద్రీకృతంగా ఉన్నాయన్న ఈసీ వాదనలు త‌ప్ప‌ని రుజువైంద‌న్నారు.

ఓటర్ల జాబితాపై కేంద్రీకరణ
​ఓటర్ల జాబితా క్రమంగా కేంద్రీకృత వ్యవస్థగా మారుతున్న తీరును ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు వ్యతిరేకించారని వామపక్ష నేతలు తెలిపారు. రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సైతం ఓటర్ల జాబితా అందుబాటులో లేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. గోవాలో దాదాపు వంద మంది అర్హులైన ఓటర్లు జాబితా నుంచి తొలగించబడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

సార్వత్రిక ఓటు హక్కుపై దాడి
ప్రస్తుత సమస్యను కేవలం సర్‌ పరిధిలో చూడరాదని వామపక్ష నేతలు స్పష్టం చేశారు. ప్రతి వయోజనుడికి ఓటు హక్కు కల్పించే సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనే ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రానికే విఘా తం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని కల సంఘం విశ్వసనీయత ఇంతగా దెబ్బతిన్న పరి స్థితి గతంలో ఎప్పుడూ లేదని పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థను దెబ్బతీయడం, ఎన్నికల సంఘం విశ్వ సనీయత కోల్పోయే పరిస్థితికి తీసుకురావడంలో పూర్తి బాధ్యత జ్ఞానే‌శ్‌కుమార్‌పైనే ఉందని ‌స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -