Homeజాతీయంసీఈసీకి సీజేపీ అల్టిమేటం

సీఈసీకి సీజేపీ అల్టిమేటం

- Advertisement -

48 గంట‌ల్లో రాజీనామా చేయాలి …
లేకుంటే దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌
జంతర్‌మంతర్‌-2.0’ చేపడతామన్న సీజేపీ నేత‌లు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకా

నవతెలంగా -న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (సీజేపీ) అల్టిమేటం జారీ చేసింది. 48 గంట‌ల్లోగా రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేసింది. లేక‌పోతే దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న చేపడతామని, ఢిల్లీలో ‘జంతర్‌మంతర్‌-2.0’ పేరుతో నిరవధిక నిరసనకు దిగుతామని హెచ్చరించింది. గురువారం నాడిక్క‌డ ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సీజేపీ క‌న్వీన‌ర్‌ అభిజీత్ దీప్కే, కో క‌న్వీన‌ర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా మాట్లాడారు. చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిటీస‌ణ‌ర్ అతిపెద్ద జాతి వ్య‌తిరేకి అని, జ్ఞానేశ్ కుమార్ త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాల‌ని, భార‌త ప్ర‌జాస్వామ్యానికి ఆయ‌న పెను ప్ర‌మాదంగా మారిన‌ట్టు విమ‌ర్శించారు. ప్రజాస్వామ్య సూత్రాలకు వ్యతిరేకంగా ఆయ‌న వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ నేతృత్వం లోని ఎన్నికల సంఘం ఓటర్ల హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందని విమ‌ర్శించారు. సీఈసీగా ఆయ‌న‌ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాతే, ఎవ‌రికి ఓటు రావాలి, ఎవ‌రికి ఓటు వ‌ద్దు అన్ని విష‌యాన్ని ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తోంద‌ని, ప్ర‌జాస్వామ్యం అంటే ఇదేనా అంటూ ప్ర‌శ్నించారు.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ మోడీ ఇంటి చప్రాసీగా మారార‌ని మండిప‌డ్డారు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని, కాబట్టి బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించాల‌ని డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహిం చబడుతున్నాయ‌ని గుర్తు చేశారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌)లో భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించారంటూ ధ్వ‌జ‌మెత్తారు. 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్లకు పైగా పేర్లు తొలగించారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ తొలగింపులపై స్పష్టత ఇవ్వాలని, ప్రభావిత ఓటర్లకు సమర్థవంతమైన పునఃపరిశీలన అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. 13 కోట్ల మంది ఓట‌ర్ల‌ను తొల‌గించ‌డమేమీ చిన్న సంఖ్య కాదు అని, 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎన్డీఏ, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య తేడా కేవ‌లం 2 శాతం ఓట్లు మాత్ర‌మే అని తెలిపారు. 13 కోట్ల మంది ఓట‌ర్ల‌ను డిలీట్ చేయ‌డం అంటే, దాదాపు 13 నుంచి 14 శాతం ఓట్ల‌ను తొలిగించ‌డ‌మే అవుతుంద‌ని అన్నారు. ఆ 2 శాతం వ్యత్యాసాన్ని పెంచేందుకు జ్ఞానేశ్ కుమార్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా? అని ప్ర‌శ్నించారు.

మూడు ప్రధాన డిమాండ్లు
సీఈసీ రాజీనామాతో పాటు ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన ప్రక్రియపై సీజేపీ పలు డిమాండ్లు చేసింది. సీఈసీపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని, సర్‌లో మరిన్ని పేర్ల తొలగింపును నిలిపివే యాలని కోరింది. జనవరి 2025 ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా ఉంచి, పేర్ల తొలగింపులను ధ్రువీకరించే వరకు రికార్డులను భద్రపరచాలని డిమాండ్‌ చేసింది. అలాగే సర్‌కు సంబంధించిన రికార్డులను సుప్రీంకోర్టుకు లేదా న్యాయపరమైన పర్యవేక్షణలోని స్వతంత్ర విచారణకు అప్పగించాలని కోరింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన 2023 చట్టాన్ని రద్దు చేసి, విస్తృత సంస్థాగత, పౌర సమాజ భాగస్వామ్యంతో కొత్త విధానాన్ని తీసుకురావాలని సీజేపీ కోరింది. తమ డిమాండ్లపై 48 గంటల్లో సిఈసి స్పందించకపోతే దేశవ్యాప్త ఆందోళనకు దిగుతామని సీజేపీ నేత‌లు ప్రకటించారు. ఢిల్లీలో గతంలో నిర్వహించిన నిరసనల తరహాలో ‘జంతర్‌మంతర్‌-2.0’ చేపడ తామని హెచ్చరించారు.

ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాల సవరణపై తలెత్తిన సందేహాలకు ప్రజలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని సీజేపీ డిమాండ్ చేశారు. బిజెపికి స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చనే భయంతోనే ప్రాంతీయ శక్తులను బలహీనపరి చేందుకు ఈ వ్యూహం పన్నారని విమ‌ర్శించారు. పశ్చిమబెంగాల్లో మమత బెనర్జీ నియోజకవర్గంలో 51 వేల ఓట్లు తొలగించార‌ని, ఆమె కేవ‌లం 15 వేల ఓట్ల‌తో ఓట‌మి పాలైంద‌ని అన్నారు. తమిళనాడు మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ నియోజ‌క‌వ‌ర్గంలో ల‌క్ష ఓట్లు తొల‌గించార‌ని, అక్క‌డ ఆయ‌న కేవ‌లం తొమ్మిది వేల‌తో ఓట‌మి చెందార‌ని తెలిపారు. ఢిల్లీలో కూడా ఇదే జరిగిందని చెప్పారు. అర‌వింద్ కేజ్రీవాల్ పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గంలో 40 వేల ఓట్లు తొల‌గించార‌ని, ఆయ‌న కేవ‌లం నాలుగు వేలు ఓట్ల‌తోనే ఓట‌మి చెందార‌ని తెలిపారు. ప్రతిపక్ష నేతలను దెబ్బతీసేలా ఓట్ల తొలగింపులు జరుగుతుంటే, దానిని స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలు అని ఎలా అంటారని ప్రశ్నించారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా విషయంలో తాము వెనక్కు తగ్గేదే లేదని తేల్చి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -