Homeరాష్ట్రీయం​క్షుద్ర పూజలంటూ తప్పుడు ప్రచారం

​క్షుద్ర పూజలంటూ తప్పుడు ప్రచారం

- Advertisement -

దానం నాగేందర్‌ ‌విషయంలో సుప్రీం తీర్పు చెంపపెట్టు
పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలకూ ఇదే పరిస్థితి : ఎమ్మెల్యే హరీశ్‌రావు

నవతెలంగాణ -సుల్తాన్ బజార్
​క్షుద్ర పూజలు చేశారంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌, అద్దంకి దయాకర్‌పై పరువునష్టం కేసు దాఖలు చేశామని, ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని బీఆర్‌ఎస్‌ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు అన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేశారంటూ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‍‍కు ఇప్పటికే లీగల్ నోటీసులు పంపించారు. అలాగే కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు గురువారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు స్వయంగా హాజరైన హరీశ్‌‌రావు మీడియాతో మాట్లాడారు. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలతో కోర్టును ఆశ్రయించామని, వచ్చే బుధవారం మరోసారి విచారణకు పిలిచారని, స్టేట్‌మెంట్లు నమోదు చేస్తామని చెప్పినట్టు వెల్లడించారు. దేవాల యాలకు వెళితే క్షుద్ర పూజలు చేశారంటూ ఇష్టానుసారంగా మాట్లాడు తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నా రని, ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు గురించి అడిగితే తమపై లేనిపోని ఆరోపణలు చేస్తూ డైవర్షన్‌ రాజకీ యాలకు పాల్పడుతు న్నారని అన్నారు. శాసనసభలో కూడా అనేక అంశాలపై తప్పుడు వివరాలు చెబుతున్నా రని, సభా హక్కుల ఉల్లంఘనపై స్పీకర్‌కు పలు మార్లు నోటీసులు ఇచ్చినా పట్టించు కోవడం లేదన్నారు.

మూడేండ్లు గడిచినా డిప్యూటీ స్పీకర్‌ నియామకం జరగలేదని, సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదులను పరిశీలించాల్సిన ప్రివిలేజెస్‌ కమిటీకి కూడా చైర్మెన్‌ లేరని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకోవడం తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో నీటి, విద్యుత్‌ సమస్యలు నెలకొన్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా తమకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని తెలిపారు. దానం నాగేందర్‌ అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్‌రెడ్డికి చెంపపెట్టు వంటిదని హరీశ్‌‌రావు వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న వారికి ఈ తీర్పు గుణపాఠమని అన్నారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని దేశవ్యాప్తంగా తిరిగే రాహుల్‌గాంధీకి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగంపై కాంగ్రెస్‌కు నిజంగా గౌరవం ఉంటే పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్‌ ‌విసిరారు. దానం నాగేందర్‌ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో స్పీకర్‌ నిర్ణయంపై తమ వాదనకు బలం చేకూరిందని చెప్పారు. మిగతా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే పరిస్థితి ఎదురవుతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -