152 మీటర్ల ఎత్తుకు ససేమిరా
సీడబ్ల్యూసీకి తేల్చి చెప్పిన ఆ రాష్ర్ట అధికారులు
ప్రీ ఫీజబులిటీ రిపోర్టును సీడబ్ల్యూసీకి అందించని తెలంగాణ
మరోసారీ భేటీపై అనుమానాలు
చొరవ చూపని రాష్ర్ట బీజేపీ నేతలు
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌పై మహారాష్ర్ట పట్టువీడటం లేదు. తెలంగాణతో గతంలో 148 మీటర్ల ఎత్తుకు చేసుకున్న ఒప్పందానికే కట్టుబడి ఉండాలని ఆ రాష్ర్ట ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. సెప్టెంబర్ 1న ఢిల్లీలో కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో జరిగిన భేటీ ఏ నిర్ణయం తీసుకోకుండానే అర్ధాంతరంగా ముగిసింది. రాష్ర్ట ప్రభుత్వం ప్రీ ఫీజబులిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్) సమర్పించిన తర్వాత మరో 15 రోజులకు మళ్లీ భేటీ కావాలని నిర్ణయించారు. అయితే సర్కార్ మాత్రం ఇప్పటి వరకు సీడబ్ల్యూసీకి రిపోర్టును అందజేయలేదు. నీటి లభ్యతపై తాజా గణాంకాలు, ముంపుపై స్పష్టమైన వైఖరితో రావాలని ఆ రాష్ర్టం తేల్చి చెప్పడంతో ఇప్పట్లో రెండు రాష్ర్టాల మధ్య భేటీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరెడ్డి హయాంలో మొదలు పెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఓ పట్టాన ముందుకు సాగడం లేదు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2015లో బీఆర్ఎస్ సర్కార్ మహారాష్ర్టతో 148 మీటర్ల ఎత్తుకు ఒప్పందం కుదుర్చు కుంది. అయితే నీటి లభ్యత లేదనే సాకుతో బ్యారేజ్ ప్రాంతాన్ని తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చింది. తాజాగా కాంగ్రెస్ సర్కార్ దీన్ని నిర్మించించేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టింది. 148 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే తెలంగాణకు పెద్దగా ప్రయోజనం ఉండదనీ, 152 మీటర్ల ఎత్తులో చేపట్టాలని నిర్ణయించింది. ప్రాజెక్ట్ ఎత్తు సవరింపుపై మహారాష్ట్రతో సమావేశాన్ని ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరిన నేపథ్యం లో కేంద్ర జల్‌శక్తి శాఖ ఆదేశాలతో సెప్టెంబర్ 1 ఢిల్లీలో ప్రత్యేక సమా వేశం ఏర్పాటు చేశారు. కేంద్ర జలసంఘం చైర్మెన్ అనుపమ్ ప్రసాద్ నేతృత్వంలో కొనసాగిన భేటీ.. ఏ నిర్ణయం తీసుకోకుండానే అర్ధాంతరంగా ముగిసింది. తెలంగాణ ప్రతి పాదించిన ఎత్తు వల్ల కలిగే పర్యవసానాలను అధికారులు సమావేశంలో వివరించారు. ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ఫీజబులిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్), నీటి లభ్యతపై తాజా గణాంకాలు, ముంపుపై స్పష్టమైన వైఖరితో రావాలని ఆ రాష్ర్టం తేల్చి చెప్పింది. మహారాష్ర్ట కోరిన విధంగా పూర్తి సమా చారంతో రావాలని తెలంగాణను ఆదేశించిన సీడబ్ల్యూసీ 15 రోజుల తర్వాత మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయిం చింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి రిపోర్టును సీడబ్ల్యూసీకి రాష్ర్ట ప్రభుత్వం అందించలేదు. మహా రాష్ర్టలోని విపక్షాలు, ప్రజల నుంచి ప్రాజెక్ట్ ఎత్తుపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్ని సార్లు సమావేశం ఏర్పాటు చేసినా గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం 148 మీటర్లకే కట్టుబడి ఉండాలని ఆ రాష్ర్టం భావిస్తోందని సమాచారం.
చొరవ చూపని రాష్ర్ట బీజేపీ నేతలు
పక్క రాష్ట్రం నిర్మించే ప్రాజెక్ట్ వల్ల తమ రైతులు భూముల కోల్పోవడాకి మహారాష్ర్ట ఒప్పుకోవడం లేదు. ఆ రాష్ర్టంతో పాటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన రాష్ర్ట నాయకుల ను ఒప్పించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు పలువురు ముఖ్య నేతలకు లేఖలు రాశారు. బీజేపీ నేతలు చొరవ చూపి మహారాష్ట్రను ఒప్పించాలనీ, ముందుండి నడిపించే బాధ్యతను మంత్రి ఉత్తమ్‌కు అప్పగించారు. అయితే ఉత్తమ్ గాని, బీజేపీ నేతలు గాని తమ వంతు ప్రయత్నాలు చేయడం లేదు. దాంతో కథ మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ముంపుపై భిన్నాభిప్రాయాలు…
148 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే కేవలం 300 ఎకరాల వరకు భూములు ముంపునకు గురవుతాయనే విషయంలో ఇంజినీర్లు, నీటి పారుదల రంగ నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు లేవు. 152 మీటర్ల ఎత్తులో మాత్రమే రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. 3వేల ఎకరాలు ముంపునకు గురవుతుందని కొందరు, 6 వేల ఎకరాల వరకు భూమి ముం పునకు గురయ్యే అవకాశం ఉందని మరి కొందరు చెబుతున్నారు. రాష్ర్ట ప్రభుత్వం కొత్త గా తయారు చేస్తున్న డీపీఆర్ బయట కొస్తే ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
రూ.11 వేలతో
కాలువల నిర్మాణం…
ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్ట్ కు సంబంధించి గత సర్కార్ రూ.11 వేల కోట్లు వ్యయం చేసి కాలు వల నిర్మాణం చేసింది. 106 కిలో మీటర్ల విస్తీర్ణంలో కెనాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయగా, 71.5 కిలో మీటర్ల మేర భూ సేకరణ చేశారు. 46 కిలో మీటర్ల కాల్వల నిర్మాణం పనులు పూర్తి చేశారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహితను పక్కనపెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను చేపట్టిం ది. ఈ కాలువలను తిరిగి వినియోగంలోకి తేవాలని సంకల్పించిన ప్రస్తుత సర్కార్ అందు కు తగ్గట్టుగా కొత్త డీపీఆర్‌ను సిద్ధం చేస్తోంది. అయితే ఎత్తుపై మహారాష్ర్ట ఒప్పుకుంటే గాని ప్రాజెక్టు అడుగు ముందుకు పడేలా లేదు.


