మహిళలు, బాలికల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలి : ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
ఐద్వా, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నారాయణగూడ ఫ్లైఓవర్ నుంచి వైఎంసీఏ వరకు ర్యాలీ
నవతెలంగాణ-హిమాయత్ నగర్
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, లైంగిక దాడుల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలే ముందు వరుసలో ఉన్నాయని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మమత అన్నారు. మహిళలపై అఘాయిత్యాలను నిరసిస్తూ ఐద్వా, ఎస్ఎఫ్ఐ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ నారాయణగూడ ఫ్లైఓవర్ నుంచి వైఎంసీఏ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులు, హత్యలు, దాడులు విపరీతంగా పెరిగి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న ఘటనలు మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగి స్తున్నాయన్నారు. మహిళలపై దాడులు జరిగిన తర్వాత స్పందించడం, నిందితు లను అరెస్టు చేయడమే కాకుండా ఇలాం టి ఘటనలు పునరావృత్తం కాకుం డా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పాఠశాలలు, కళాశాలలు, పని ప్రదేశాలు, రోడ్లు, ప్రజా రవాణా, పార్కులు, పర్యాటక ప్రాంతాల్లో భద్రత లేకపోవడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మమత మాట్లాడుతూ.. దేశంలో మహిళపై ప్రతి 18 నిమిషాలకు ఒక లైంగికదాడి జరగడం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. మహిళలు భయపడకుండా స్వేచ్ఛగా, గౌరవంగా జీవించే హక్కును కల్పించాలని ప్రభుత్వా లను కోరారు. హింసకు దారితీస్తున్న మూల కారణాలను గుర్తించి ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పాఠశాలలు, కళాశాలల్లో స్త్రీ, పురుష సమానత్వం, మహిళలను గౌరవించే సంస్కృతి, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. మద్యం, డ్రగ్స్ వినియోగం, పోర్న్ వెబ్ సైట్లను నిషేధించాలని డిమాండ్ చేశారు. పార్కులు, మహిళలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, నగర శివారు ప్రాంతాల్లో ఉన్న కళాశాలలు, పాఠశాలల పరిసరాల్లో పోలీసు పెట్రోలింగ్ ను పటిష్టం చేసి, విద్యార్థినుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి, సహాయ కార్యదర్శులు కెఎన్.ఆశాలత, కె.నాగలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శశికళ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.లక్ష్మమ్మ, ఎ.పద్మ, షబానా బేగం, స్వరూప, నాయకులు భవాని, కవిత, వెంకటమ్మ, ఎల్లమ్మ, లక్ష్మి, చిట్టెమ్మ, నారాయణమ్మ, లక్ష్మి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి, నాయకులు భరత్, ప్రవీణ్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.



