Homeరాష్ట్రీయంకేంద్రం నిర్ణయంతో రైతుల నోట్లో మట్టే

కేంద్రం నిర్ణయంతో రైతుల నోట్లో మట్టే

- Advertisement -

ఆయిల్‌‌పామ్‌‌పై సుంకం 16.5 శాతం నుంచి 11 శాతానికి తగ్గించడం దారుణం
విదేశీ దిగుమతుల ప్రోత్సాహం ఆత్మనిర్భర భారత్ అవుతుందా ?
సుంకం తగ్గింపుపై కేంద్రం పునరాలోచించుకోవాలి : మంత్రి తుమ్మల

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆయిల్ పామ్ రైతుల నోట్లో మట్టికొట్టేలా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశీయ రైతులకు మేలు జరిగేలా ‌ముడి పామాయిల్‌ దిగుమతిపై సుంకాన్ని 44 శాతానికి పెంచాలని కోరుతుంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న 16.5 శాతాన్ని 11 శాతానికి తగ్గించడమేంటని ప్రశ్నించారు. ‘‘ఆత్మనిర్భర్ భారత్ అంటే విదేశీ దిగుమతులపై ఆధారపడటం కాదు.. దేశ రైతు ఉత్పత్తి చేసే నూనెను పెంచడం. రైతును బలోపేతం చేయకుండా దిగుమతులను చౌక చేయడం ద్వారా దేశం ఆత్మనిర్భర్ కాదు. దేశీయ రైతు నిలబడితేనే దేశం నిలబడుతుంది” అని స్పష్టం చేశారు. ఒకవైపు దేశంలో ఆయిల్ పామ్ సాగును విస్తరించాలనీ, రైతులను ఆ పంట వైపు మళ్లించాలని రాష్ట్రాలకు సూచిస్తూ.. మరోవైపు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్‌పై సుంకాన్ని తగ్గించడం కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులకు మద్దతు ధర భరోసా కల్పించాల్సిన సమయంలో విదేశీ దిగుమతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కేంద్రం ఎవరికి ప్రయోజనం కల్పించాలనుకుంటోందని ప్రశ్నించారు.

ఆయిల్ పామ్ అనేది సాధారణంగా ఒక సీజన్‌లో పండించి విక్రయించే పంట కాదని, రైతు…సంవత్సరాల పాటుపెట్టుబడి పెట్టి, నీరు, ఎరువులు, నిర్వహణ ఖర్చులు భరిస్తూ సాగు చేసే దీర్ఘకాలిక పంట అని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి పంటకు మార్కెట్ ధరపై విధానపరమైన స్థిరత్వం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 3.20 లక్షల ఎకరాల్లో 88 వేలకుపైగా రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారనీ, దేశంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణంలో తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు. రైతులను ఆయిల్ పామ్ వైపు మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి రాయితీలు, నాట్ల విస్తరణ, డ్రిప్‌ ఇరిగేషన్, మౌలిక సదుపాయాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, రిఫైనరీలు వంటి అనేక చర్యలు చేపట్టిందని వివరించారు. తాజా ఆయిల్ పామ్ గెలలకు టన్నుకు రూ.25 వేల కనీస హామీ ధర కల్పించాలని కేంద్రాన్ని కోరారు. ఎఫ్‌ఎఫ్‌‌బీ ధర ప్రభుత్వం నిర్ణయించే విధానం ప్రకారం అమలవుతోందని, రైతులకు మరింత స్థిరమైన ధర భరోసా అవసరమని సూచించారు. కేంద్రం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించి, దేశీయ ఆయిల్ పామ్ రైతులకు రక్షణ కల్పించే విధానాన్ని తీసుకురావాలని డిమాండ్‌ ‌చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -