– కేరళ తరహా ప్రజా ప్రణాళికే ప్రత్యామ్నాయం
– శ్రీకాకుళం సమగ్రాభివృద్ధి సదస్సులో వి శ్రీనివాసరావు
శ్రీకాకుళం: వికసిత్ భారత్, మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ వంటి పేర్లతో మోడీ తీసుకొచ్చిన అభివృద్ధి నమూనా దేశంలో విఫలమైందని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఎవిఎస్ భవన్‌లో ఆదివారం నిర్వహించిన శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టి పదేళ్లు కావస్తున్నా, కనీసం ఎలక్ట్రానిక్ చిప్‌ను సొంతంగా తయారు చేసుకోలేని పరిస్థితి ఉందన్నారు. గుజరాత్ నమూనా అంటూ ప్రచారం చేశారని, ఇప్పుడు ఆ రాష్ట్రం నుంచి వలసలు పోతున్న ఎనిమిది వేల మంది కార్మికులు పోలీసులకు పట్టుబడడం మోడీ అభివృద్ధి నమానాకు అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న మోడీ.. అప్పులు, ఆత్మహత్యలను రెట్టింపు చేశారని విమర్శించారు. మోడీ అభివృద్ధి నమూనా విఫలం కావడంతో 2024 ఎన్నికల్లో లబ్ధి కోసం అయోధ్య రాముని నామం జపం చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో మానవాభివృద్ధి సూచీలో కేరళ ప్రథమ స్థానంలో ఉందని, కేరళలో వామపక్ష ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా ప్రణాళికే అభివృద్ధికి సరైన ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. ఎలక్ట్రోరల్ బాండ్లు స్వీకరించడం ఒక పెద్ద కుంభకోణమని, మోడీ అందులో మునిగిపోయారని తెలిపారు. ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేస్తేనే ప్రజాస్వామ్యం బతికిబట్టకట్టదని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ అమ్మకానికి కుదరకపోతే మూసేయడానికి సిద్ధపడుతోందని తెలిపారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తోన్న బీజేపీిని వైసీపీి, టీడీపీ పార్టీలు పల్లెత్తు మాట అనకపోవడం దారుణమన్నారు. హైదరాబాద్‌లోని ఆస్తులన్నీ తెలంగాణకు అప్పగించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఇప్పుడు హైదరాబాద్ రాజధాని కావాలంటున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ఎన్నికలు వస్తుండడంతో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి హైదరాబాద్ రాజధాని అంశాన్ని తెర పైకి తెచ్చారన్నారు. ప్రభుత్వ విద్యా రంగం బలోపేతం, నిష్ణాతులైన ఉపాధ్యాయులను తయారు చేయాల్సిన ముఖ్యమంత్రి బైజూస్, ఎడెక్స్ వంటి ప్రయివేట్ కంపెనీలకు చీఫ్ మార్కెటింగ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కేవలం నగదు బదిలీ పథకాలతోనే అభివృద్ధి జరగదని, ప్రజల ఆదాయాలు పెరగవని చెప్పారు. నగదు బదిలీతో జనం తొలుత కొంత ఆదరించినా, కరెంట్ ఛార్జీల పెంపు, ప్రజలపై పలు రకాల పన్నుల భారం మోపడంతో 2024 నాటికి జగన్‌మోహన్‌రెడ్డి ఫెయిల్యూర్ సీఎంగా నిలిచారని వివరించారు. అనంతరం ‘విద్య-వైద్యం’ అనే అంశంపై పూర్వ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్ శర్మ ముఖ్య వక్తగా మాట్లాడారు. ‘పారిశ్రామికీకరణ-ఉపాధి అవకాశాలు’పై జివిఎంసి కార్పొరేటర్ బి.గంగారావు, ‘వ్యవసాయం, నీటి ప్రాజెక్టులు’పై నీటిపారుదల విశ్రాంత చీఫ్ ఇంజనీర్ ఉప్పలపాటి నారాయణరాజు ప్రసంగించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు.