నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తాను ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నాననీ,వచ్చే లోక్సభ ఎన్నికల్లో అక్కడి క్యాడర్ తనను పోటీ చేయాలని కోరుతున్నారని పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు తెలిపారు. అక్కడ ఎంపీగా పోటీ చేసి తీరుతానని చెప్పారు. సోమవారం గాంధీభవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా తాను పోరాటం చేసినట్టు తెలిపారు. పార్టీ కోసం నా కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా? ఇండియాలో నాకంటే ఎక్కువ తిరిగే నాయకులు ఉన్నారా? నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకు పక్కన పెట్టారు? కొత్తగా వచ్చిన వాళ్ళు టికెట్లు అడిగితే నా లాంటి సీనియర్ల పరిస్థితి ఎంటి? అంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిపై తనకు నమ్మకం ఉందని తెలిపారు. గతంలో కూడా తనకు అన్యాయం జరిగిందని గుర్తుచేశారు. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీని గుడికి రానివ్వడం లేదు. గుడులు వాళ్ల అయ్య జాగీర్లా? అంటూ వీహెచ్ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.