– సందేశ్‌ఖలి కేసులో వెంటనే అదుపులోకి తీసుకోండి : కలకత్తా హైకోర్టు
కోల్‌కతా : సందేశ్‌ఖలిలో నెలకొన్న అశాంతి కలకత్తా హైకోర్టును చేరింది. పరారీలో వున్న తృణమూల్ కాంగ్రెస్ నేత, ఉత్తర 24 పరగణాల జిల్లా పరిషత్‌కి చెందిన షేక్ షాజహాన్ అరెస్టుపై ఎలాంటి స్టే లేదని ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్,శివజ్ఞానం నాయకత్వంలోని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. నాలుగేండ్ల క్రితమే ఫిర్యాదులు వచ్చాయి. ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదు. వెంటనే అరెస్టు చేయండి అంటూ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో పబ్లిక్ నోటీసు ఇవ్వండని పేర్కొంది. సందేశ్‌ఖలిలో తృణమూల్ కాంగ్రెస్ నేతలు లైంగిక వేధింపులకు, బెదిరింపులకు పాల్పడుతున్నారని వచ్చిన ఆరోపణలను కోర్టు తనకు తానుగా పరిగణనలోకి తీసుకుంది. షాజహాన్ అరెస్టుపై ఎలాంటి స్టే లేదని కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో వారం రోజుల్లో అరెస్టు చేస్తామని తృణమూల్ పార్టీ ప్రతినిధి కునాల్ ఘోష్ సోషల్ మీడియాలో తెలిపారు. ఆయనను అరెస్టు చేయడంపై స్టే వుండడంతో పోలీసులు చర్యలు తీసుకోలేకపోతున్నారంటూ పార్టీ నేత అభిషేక్ బెనర్జీ ఇంతకుముందు తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు వికరణ వెలువడింది. హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనందబోస్ సమర్ధించారు. ముఖ్యమైన నిర్ణయాన్ని న్యాయస్థానం తీసుకుందన్నారు. ఎన్నికైన ప్రభుత్వం చట్టపరిధిలో చర్యలు తీసుకుంటుందా లేదా అని చూడడమే గవర్నర్ విధి అని, అప్పటివరకు గవర్నర్ జోక్యం చేసుకోరాదని వ్యాఖ్యానించారు. షాజహాన్ పూర్తిగా రాష్ట్ర పోలీసుల ఆశ్రయంలో వున్నారంటూ సిపిఎం ఎంపి వికాస రంజన్ భట్టాచార్య విమర్శించారు. సందేశ్‌ఖలిలో తృణమూల్ నేతల ఇళ్ళ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. నేతల చర్యలపై ఆగ్రహావేశాలతో వున్న ప్రజలు ఇండ్లపై రాళ్ళు వేస్తుండడంతో ఈ చర్యలు తీసుకున్నారు. బెర్మాజర్‌కి చెందిన టీఎంసీ నేత శంకర్ సర్ధార్ ఇంటిపై సోమవారం ఉదయం గ్రామస్తులు దాడి చేశారు. మంత్రులకు సన్నిహితంగా వుండే సర్దార్ తమను తరచూ అడ్డగిస్తూ, బెదిరిస్తున్నాడని వారు ఆరోపించారు.
స్థానికంగా బలమున్న మరో నేత అజిత్ మెయితీ ఇంటిపై కూడా ఆదివారం గ్రామస్తులు దాడి చేశారు. దాంతో భయపడిన మెయితీ పారిపోయి ఒక వలంటీర్ ఇంట్లో తల దాచుకున్నాడు. పోలీసులు అక్కడకు వెళ్ళి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.