ఇజ్రాయెల్‌ సమస్యపై భారత్‌ మౌనం

ఇజ్రాయెల్‌ సమస్యపై భారత్‌ మౌనం– పాలస్తీనా సంఘీభావ సదస్సులో సుభాషిణి అలీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ భారతదేశాన్ని ”ఇజ్రాయెల్‌ , పాశ్చాత్య సామ్రాజ్యవాదానికి స్థావరం”గా మార్చారని ఆదివారం నాడిక్కడ జరిగిన పాలస్తీనా సంఘీభావ సదస్సులో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు సుభాషిణి ఆలీ విమర్శించారు.
‘అంతర్జాతీయ న్యాయస్థానం – గాజాలో న్యాయం’ అనే అంశంపై ఇక్కడి ‘కానిస్టిట్యూషన్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా’ హాలులో ఏర్పాటు చేసిన సదస్సులో సుబాషిణి అలీ మాట్లాడుతూ, పాలస్తీనాపై యూదు దురహంకార ఇజ్రాయిల్‌ దురాక్రమణను వ్యతిరేకించకుండా హమాస్‌పై ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధంలో అమెరికా మాదిరిగానే భారత్‌ కూడా మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. ”గాజా , వెస్ట్‌ బ్యాంక్‌లో మారణ హౌమం” సృష్టిస్తున్న ఇజ్రాయిల్‌కు అదానీ-నిర్మిత డ్రోన్‌లను, ఆయుధాలను భారత్‌ పంపుతూ దీనిని కూడా గర్వకారణంగా చెప్పుకోవడం మోడీ ప్రభుత్వ దివాళాకోరుతనాన్ని తెలియజే స్తోందన్నారు.
సైన్స్‌ మ్యూజియంలోని గ్యాలరీని ఈ నెత్తుటి మరకలు కలిగిన అదానీ గ్రూప్‌నకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ లండన్‌లో మహిళలు, పిల్లలు నిరసన తెలిపారని సీపీఐ (ఎంఎల్‌) ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య పేర్కొన్నారు.ఇజ్రాయిల్‌ అనుసరిస్తున్న ‘ జాతీయవాదం, అణచివేత ,నిఘా’ నమూనానే మోడీ ప్రభుత్వం కూడా అవలంబించిందని ఆయన విమర్శించారు. కాశ్మీర్‌లోను, భారతదేశంలోని రైతులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ తయారు చేసిన స్పైవేర్‌, డ్రోన్‌లను మోడీ ప్రభుత్వం నిర్లజ్జగా ఉపయోగిస్తున్నదని ఆయన విమర్శించారు.
ఇజ్రాయిల్‌ అనుసరిస్తున్న వర్ణవివక్షపై దక్షిణాఫ్రికా ఆ దేశాన్నిఅంతర్జాతీయ న్యాయ స్థానానికి లాగగా, 200 సంవత్సరాల వలసవాదం, సామ్రాజ్యవాదానికి గురైన భారతదేశం మాత్రం ఇజ్రాయెల్‌ దుర్మార్గాలను మౌనంగా వెనకేసు కొస్తోందని అన్నారు.
సీపీఐ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌ తన సంక్షిప్త ప్రసంగంలో, బీజేపీ ప్రభుత్వం ”పాశ్చాత్య సామ్రాజ్యవాదానికి లొంగిపోవడం” తనకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ఆరెస్సెస్‌ సిద్ధాంతకర్త గురు గోల్వాల్కర్‌ భారతదేశానికి శత్రువులు బ్రిటిష్‌వారు కాదని, క్రైస్తవులు, ముస్లింలు, కమ్యూనిస్టులేనని చెప్పడాన్ని బట్టే ఆరెస్సెస్‌ ఎవరికి ఊడిగం చేస్తుందో అర్థమవుతోందన్నారు. భారతదేశాన్ని ఫాసిస్టు మత రాజ్యంగా మార్చే ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాను మోడీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని విమర్శించారు.
పాలస్తీనాకు భారత ప్రజలు అండగా నిలుస్తారని సదస్సు పేర్కొంది. అమెరికాతో సహా పశ్చిమ దేశాలకు అండగా నిలవడంలో భారత ప్రభుత్వం విఫలమైందని, ఇజ్రాయెల్‌ను ఖండించడానికి, భారత్‌ ఫాసిస్ట్‌ శక్తుల కుట్రలకు బలికాకుండా చూసేందుకు భారతీయులంతా ఏకం కావాలని సదస్సు పిలుపునిచ్చింది.

Spread the love