రైతుల హక్కులను ఉల్లంఘిస్తున్నాయి

రైతుల హక్కులను ఉల్లంఘిస్తున్నాయి– కేంద్రం, 4 రాష్ట్రాలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌
న్యూఢిల్లీ : శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతుల హక్కులను కేంద్రం, కొన్ని రాష్ట్రాలు ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అనేక రైతు సంఘాలు తమ పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కోసం చట్టపరమైన హామీని, స్వామినాథన్‌ కమిటీ సిఫారసులను అమలు చేయాలని కోరుతూ నిరసనలకు పిలుపునిచ్చిన తర్వాత, కేంద్రం, కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు బెదిరించే ధోరణిలో ఆదేశాలు జారీ చేసి దేశ రాజధాని సరిహద్దులను పటిష్టం చేశాయని పిటిషన్‌ పేర్కొన్నది. ”శాంతియుత నిరసనలతో అన్యాయానికి గురవుతున్న రైతుల ప్రయోజనాల కోసం పిటిషనర్‌ మాండమస్‌ రిట్‌ను కోరుతున్నారు” అని సిక్కు ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అగ్నోస్టోస్‌ థియోస్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో తెలిపారు. కొంతమంది నిరసనకారులను బలవంతంగా అరెస్టు చేశారనీ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అదుపులోకి తీసుకున్నాయని పిటిషన్‌లో ఆరోపించారు. సోషల్‌ మీడియా ఖాతాలను నిరోధించడం, ట్రాఫిక్‌ను మార్చటం, రోడ్లను నిరోధించటం వంటి నిషేధ చర్యలను కేంద్రం అనవసరంగా అమలు చేసిందని వివరించారు. హర్యానా, పంజాబ్‌, యూపీ, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు రైతులపై టియర్‌ గ్యాస్‌, రబ్బర్‌ బుల్లెట్లు, పెల్లెట్లు ప్రయోగించడం వంటి దూకుడు, హింసాత్మక చర్యలను అమలు చేశాయనీ, వారికి తీవ్ర గాయాలయ్యాయని పిటిషనర్‌ ఆరోపిం చారు. బాధిత రైతులు, వారి కుటుంబాలకు తగిన నష్టపరిహారంతో పాటు, పోలీసుల మానవ హక్కుల ఉల్లంఘనపై నివేదిక ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.

Spread the love