సుప్రీం తీర్పు అమలు జరిగేనా ?

Will the Supreme judgment be implemented?– గతంలో ఇచ్చిన ఆదేశాలకే అతీగతీ లేదు
– జాప్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించొచ్చు
– కోర్టులో సవాలు చేయొచ్చు
– ఎన్నికల బాండ్ల పథకంపై కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌ శైలేష్‌ గాంధీ
న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఈ నెల 15న ఇచ్చిన తీర్పు సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రజలకు ఉన్న హక్కును చాటిచెప్పింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని తెలుసుకునే హక్కు పౌరులకు ఉంటుందని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల కొనుగోలుకు సంబంధించిన వివరాలన్నింటినీ మార్చి 13 నాటికి బయటపెట్టాలని న్యాయస్థానం ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాలు అమలైనప్పుడే తీర్పుకు సార్ధకత చేకూరుతుంది. అయితే తీర్పు అమలుపై పరిశీలకులు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
సుప్రీం ఆదేశాల అమలు నుండి తప్పించుకునేం దుకు ప్రభుత్వం మార్గాలను అన్వేషించే అవకాశం ఉంది. ముఖ్యంగా మే 15 వరకూ సమాచారాన్ని బహిర్గతం చేయకుండా తాత్సారం చేయవచ్చు. అప్పటికి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. కొత్త ప్రభుత్వం కూడా కొలువు తీరుతుంది. అయితే సుప్రీం తీర్పు అమలును వాయిదా వేయవచ్చా అనేదే ఇక్కడ ప్రశ్న. గతంలో ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకున్నాయన్న విషయాన్ని గమనించాల్సి ఉందని కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌ శైలేష్‌ గాంధీ తెలిపారు.
తీర్పు ఇచ్చినా…
2011లో సమాచార హక్కు పిటిషన్లకు సంబంధించిన అప్పీళ్లపై శైలేష్‌ నిర్ణయం తీసుకుంటూ ఆర్‌బీఐకి ఆదేశాలు జారీ చేశారు. పన్ను ఎగవేతదారుల జాబితా, బ్యాంకుల ఆడిట్‌ నివేదికలు, తనిఖీ రిపోర్టులకు సంబంధించిన సమాచారాన్ని పౌరులకు అందజేయాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనిపై ఆర్‌బీఐ స్టే ఉత్తర్వులు పొందింది. 2015 డిసెంబర్‌లో శైలేష్‌ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. సమాచార కమిషనర్‌ జారీ చేసిన ఆదేశాలలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకూ సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా సమాచారాన్ని ఆర్‌బీఐ అందజేయలేదు. చట్టపరంగా సవాళ్లు చేశారు. సుప్రీంకోర్టు బెంచ్‌ ఎదుట కథ కొనసాగుతూనే ఉంది. తీర్పును అమలు చేయడం లేదంటూ సుప్రీంలో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ కూడా దాఖలైంది. దీనిపై 2019లో విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం సమాచారాన్ని ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది కూడా. అయితే ఇప్పటికీ ఈ వ్యవహారం కోర్టులో నలుగుతునే ఉంది.
గోప్యత హక్కుకు భంగమా?
సుప్రీంకోర్టు తీర్పులో మరో కోణం కూడా ఉంది. సమాచార గోప్యతకు సంబంధించిన వ్యక్తిగత హక్కును హరించేలా సుప్రీం తీర్పు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యక్తిగత సమాచారాన్ని నిరాకరించవచ్చునని గతంలో సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. ‘గోప్యత’ ప్రాతిపదికన తీర్పును ప్రభుత్వం సవాలు చేసే అవకాశం ఉంది.
సమాచార హక్కు చట్టం పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గుర్తిస్తోంది. సెక్షన్‌ 8 (1)లో పొందుపరచిన మినహాయింపుల కిందికి వచ్చే సమాచారాన్ని మాత్రమే నిరాకరించవచ్చు. సమాచారం వ్యక్తిగతమైనది అయితే…అది ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించింది కాకపోతే…గోప్యత హక్కుకు భంగం కలిగించక పోతే దానిని పౌరులకు అందజేయవచ్చునని సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 8 (1) (జే) చెబుతోంది. అయితే గోప్యత అంటే ఏమిటో నిర్ధారించడం కష్టం. పార్లమెంటుకు ఇచ్చేందుకు నిరాకరించకూడని సమాచారాన్ని వ్యక్తులకు ఇచ్చేందుకు కూడా నిరాకరించకూడదు. ఇది చట్టంలో చాలా కీలకమైన నిబంధన. దీని కింద మినహాయింపు కోరుకోవాలని భావించే అధికారి పార్లమెంటుకు లేదా రాష్ట్ర శాసనసభకు సమాచారాన్ని ఇవ్వబోమని ప్రకటించాల్సి ఉంటుంది.
వ్యక్తిగత సమాచారమంతటికీ చట్టంలోని షరతులకు లోబడి మినమాయింపు కోరవచ్చునని అనేక సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి. ఆరు నెలల లోపే కేసుల్ని పరిష్కరిస్తే ఇలాంటి చిక్కుముడులు తలెత్తవు. అయితే న్యాయస్థానాల్లో ఖాళీల భర్తీ జరగనంత వరకూ ఇది సాధ్యం కాదని శైలేష్‌ గాంధీ అభిప్రాయపడ్డారు.
చట్టం ద్వారా పథకాన్ని తీసుకొస్తే…
ఎన్నికల బాండ్ల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఓ ముఖ్యమైన కోణం ఉంది. గత ఏడు సంవత్సరాల సమాచారాన్ని బహిర్గతం చేయాలని సుప్రీం ఆదేశించింది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయ మేమంటే ఎన్నికల బాండ్ల పథకాన్ని పార్లమెంట్‌ చట్టం ద్వారా తీసుకొచ్చారు. రాజకీయ పార్టీకి విరాళమిచ్చే వ్యక్తుల పేర్లను బయటపెట్టబోమని అందులో స్పష్టంగా చెప్పారు. ఏడు సంవత్సరాల తర్వాత ఈ హామీని ఉల్లంఘించవచ్చా ? ఏడు సంవత్సరాల తర్వాత అలాంటి నిర్ణయం తీసుకోవచ్చా ? తమ గుర్తింపును బహిర్గతం చేయబోమన్న హామీతోనే వ్యక్తులు లేదా సంస్థలు రాజకీయ పార్టీలకు విరాళాలు అందించాయి. పార్లమెంట్‌ ఆమోదించిన చట్టం పైనే దేశానికి విశ్వాసం, నమ్మకం లేకపోతే ఎలా అనే ప్రశ్న తలెత్త్తవచ్చు.

Spread the love