ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం

Electoral Bonds Unconstitutional– సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
– సమాచార హక్కును హరిస్తోంది
– క్విడ్‌ప్రోకోకు దారితీస్తుంది
– వివరాలన్నీ వెబ్‌సైట్‌లో ఉంచాలి : సీఈసీకి సుప్రీం ఆదేశం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సార్వత్రిక ఎన్నికల ముంగిట అధికార బీజేపీకి సుప్రీంకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. 2018లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకాన్ని అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని, సమాచార హక్కును హరించేదిగా ఉందని గురువారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఎన్నికల బాండ్ల జారీని తక్షణమే నిలిపివేయాలని ఎస్బీఐని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ నేతృత్వంలో న్యాయమూర్తులు సంజీవ్‌ ఖన్నా, బిఆర్‌ గవారు, జెబి పార్దివాలా, మనోజ్‌ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. ఆర్టికల్‌ 19(1) (ఎ) లోని వాక్‌ స్వాతంత్య్రాన్ని, పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కును కూడా ఈ పథకం ఉల్లంఘిస్తోందని న్యాయస్థానం తెలిపింది. జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ ధర్మాసనం తీర్పు ఏకగ్రీవంగానే ఉంది. కారణాల విషయంలో మాత్రం స్వల్ప తేడా ఉన్నదని తీర్పును చదివిన జస్టిస్‌ చంద్రచూడ్‌ చెప్పారు. ఎలాంటి వివరాలు లేకుండా ఎన్నికల బాండ్లను స్వీకరించడం సమాచార హక్కుకు భంగకరమని ధర్మాసనం అభిప్రాయపడింది. నల్లధనానికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో సమాచార చట్టాన్ని ఉల్లంఘించడం సమర్ధనీయం కాదని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు అపరిమిత విరాళాలు అందజేయడాన్ని అనుమతిస్తూ కంపెనీల చట్టంలో చేసిన సవరణలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పార్టీలకు బాండ్ల రూపంలో విరాళాలు ఇవ్వడం క్విడ్‌ప్రోకోకు దారితీస్తుందని తెలిపింది. విరాళాలు అందించే వారి పేర్లు, వివరాలు రహస్యంగా ఉంచడం సరికాదని, ఇలా చేయడం ఆదాయపన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 139తో సవరించిన సెక్షన్‌ 29(1)(సి), ఫైనాన్స్‌ యాక్ట్‌ సవరించిన సెక్షన్‌ 13(బి), ఆర్‌పిఎ, ఐటి చట్టంలో 29(1) సెక్షన్‌ సవరణ రాజ్యాంగ వ్యతిరేకం అవుతుందన్నారు. 2019 ఏప్రిల్‌ 12వ తేదీ నుంచి ఇప్పటి వరకూ విక్రయించిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 6వ తేదీలోగా కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేయాలని ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. పార్టీలకు విరాళాలు ఇచ్చింది ఎవరు, ఏ పార్టీకి ఇచ్చారు, ఎంత మొత్తంలో అందించారు వంటి వివరాలను మార్చి 13వ తేదీలోగా వెబ్‌సైట్‌లో ఉంచాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. రాజకీయ పార్టీలు తమకు అందిన ఎన్నికల బాండ్లను సొమ్ము చేసుకోని పక్షంలో వాటిని దాతలకు వాపసు చేయాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల పథకాన్ని మోడీ ప్రభుత్వం 2018 ప్రారంభంలో తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా వ్యక్తులు లేదా కంపెనీలు రాజకీయ పార్టీలకు అపరిమితంగా విరాళాలు అందజేయవచ్చు. కార్పొరేట్‌ సంస్థలు, బహుళజాతి కంపెనీలు కాంట్రాక్టుల ద్వారా చేకూరిన లబ్ధికి ప్రతిఫలంగా చెల్లించే ముడుపులకు ఇదొక రాచమార్గంగా ఉంది. ప్రభుత్వం ద్వారా ఆయాచితంగా లబ్ధిపొందే క్రోనీ క్యాపిటలిస్టు, విదేశీ కంపెనీలు ఇండియాలోని తమ ఏజెంట్ల ద్వారా ఈ బాండ్లను కొనుగోలు చేసి అధికార పార్టీకి ఇచ్చేందుకు (క్విడ్‌ ప్రోకోకు) కూడా ఇది వీలు కల్పిస్తోంది. అంతేకాదు ప్రత్యర్థి పార్టీకి విరాళాలు అందకుండా అడ్డుకోవడానికి ఈ బాండ్ల విధానంలో నిబంధనలున్నాయి. 2018 నుంచి ఈ ఏడాది ప్రారంభం వరకూ రూ.16,518 కోట్ల విలువ కలిగిన ఎన్నికల బాండ్లను ఎస్బీఐ విక్రయించిందని ప్రభుత్వం ఇటీవల పార్లమెంటుకు తెలియజేసింది. తాజాగా జనవరి 2-11 తేదీల మధ్య రూ.570 కోట్ల విలువ కలిగిన ఎన్నికల బాండ్ల విక్రయం జరిగింది. ఎన్నికల బాండ్ల పథకాన్ని కాంగ్రెస్‌ నేత జయా ఠాకూర్‌, సీపీఐ (ఎం), ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ (ఏడీఆర్‌) సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. ఈ కేసులో సుప్రీంకోర్టు గత సంవత్సరం మూడు రోజుల పాటు వాదనలు విన్నది. నవంబర్‌ 2న తీర్పున రిజర్వ్‌ చేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ అందజేసిన సమాచారం ప్రకారం 2016-2022 మధ్య రూ.16,437.63 కోట్ల విలువైన 28,030 ఎన్నికల బాండ్లను విక్రయించారు. వీటిలో అత్యధికంగా బీజేపీ రూ.10,122 కోట్ల విరాళం పొందింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు రూ.1,547 కోట్లు, తృణమూల్‌ కాంగ్రెస్‌కు రూ.823 కోట్లు అందాయి. జాబితాలోని 30 పార్టీలకు కలిపి ఎంత విరాళం అందిందో దాని కంటే ఎక్కువ విరాళం బీజేపీకే అందడం గమనార్హం.
సుప్రీం కోర్టులో వాదించిన సీపీఐ(ఎం) తరఫు న్యాయవాది
సీపీఐ(ఎం) తరపున షాదాన్‌ పరాసత్‌ సుప్రీంకోర్టులో వాదిస్తూ మేం జాతీయ పార్టీగా అధికారంలో ఉన్నప్పటికీ సూత్రబద్ధ వైఖరి తీసుకున్నాం. ఎలక్టోరల్‌ బాండ్స్‌ను ఈ ఐదున్నర సంవత్సరాల్లో ఒక రూపాయి కూడా తీసుకోలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14లో పొందుపరచబడిన దానికి భిన్నంగా ఈ 2018 ఎలక్టోరల్‌ బాండ్స్‌ స్కీమ్‌ సాధారణ దాతలను అజ్ఞాత దాతలుగా మారుస్తుంది.

మోడీ అవినీతి విధానాలకు మరో నిదర్శనం : రాహుల్‌ గాంధీ
”సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి విధానాలకు మరో రుజువు, ముడుపులు, కమిషన్లు తీసుకోవడానికి ఎన్నికల బాండ్ల పథకాన్ని ఒక మార్గంగా తయారు చేసింది.” అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు.
”విరాళాలు అందుకున్న భారత, విదేశీ కంపెనీలకు ఇచ్చిన రాయితీలు, ప్రయోజనాలు ఏమిటో ఎవరికీ తెలియదు, అటువంటి అతిపెద్ద కుంభకోణం జరిగింది.” అని రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ విమర్శించారు.
”సమానత్వం, స్వచ్ఛత, సహేతుకత, ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రతి సూత్రాన్నీ ఈ పథకం ఉల్లంఘించింది.” అని మాజీ అర్ధిక మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత చిదంబరం విమర్శించారు.

Spread the love