బాధ్యుల సంగతేంటి?

What about those responsible?– దోషులను జైలుకు పంపితే సరిపోతుందా…
–  బిల్కిస్‌ బానో కేసులో సుప్రీం తీర్పు తర్వాత అనేక ప్రశ్నలు
న్యూఢిల్లీ : బిల్కిస్‌ బానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆమెకే కాదు… దేశంలోని ప్రజాస్వామ్యవాదులందరికీ పెద్ద ఊరటనిచ్చింది. బిల్కిస్‌ బానోపై లైంగికదాడి చేసి, ఆమె కుటుంబసభ్యులను కిరాతకంగా హతమార్చిన నరరూప రాక్షసులను తిరిగి జైలుకు పంపాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. న్యాయం కోసం ఆమె చేసిన సుదీర్ఘ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. న్యాయం ఇంకా సజీవంగానే ఉన్నదని సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా చాటిచెప్పింది. గుజరాత్‌ ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిది. లైంగికదాడి నిందితులకు న్యాయస్థానం విధించిన కారాగార శిక్షను తగ్గించి, వారికి క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సభ్య సమాజం జీర్ణించుకోలేకపోయింది. ఈ తీర్పుతో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌కు ఎవరు బాధ్యులు? రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పుపై ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. బహుశా అది ఇంకా షాక్‌ నుంచి తేరుకొని ఉండదు. సుప్రీం తీర్పుపై అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. హోం మంత్రి అమిత్‌ షాదీ అదే దారి. గుజరాత్‌ ముఖ్యమంత్రి సైతం స్పందించలేదు. చివరికి గుజరాత్‌కు సంబంధించిన వారెవ్వరూ తమ స్పందనను తెలియజేయలేదు. ఇంత ప్రాధాన్యత కలిగిన తీర్పుపై టీవీ ఛానళ్లలో కూడా పెద్దగా చర్చా గోష్టులు జరగలేదు. అనేక మంది యాంకర్లు మాల్దీవులపై అక్రోశాన్ని వెళ్లగక్కడంలో బిజీబిజీగా గడిపారు. లైంగికదాడి దోషులకు క్షమాభిక్ష ప్రసాదించిన ఘనత వహించిన గుజరాత్‌ ప్రభుత్వంలోని మంత్రులందరూ ఈ తీర్పుతో తమకేమీ సంబంధం లేనట్లుగానే వ్యవహరిస్తున్నారు. దోషులను శిక్షాకాలం పూర్తి కాకముందే విడుదల చేయడానికి రాజకీయ నాయకులో లేక అధికారులో కారకులై ఉండాలి. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? వారు తమ తప్పిదానికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం లేదా? వారు తగిన శిక్ష అనుభవించవద్దా? బిల్కిస్‌ బానో కేసులోనే కాదు… అనేక కేసుల విషయంలోనూ అమాయకులు బలవుతున్నారు. ఏ నేరం చేయకపోయినా రాజద్రోహం వంటి క్రూరమైన చట్టాలను ప్రయోగించి సంవత్సరాల తరబడి కటకటాల వెనుక ఉంచుతున్నారు. న్యాయస్థానాల్లో సుదీర్ఘ పోరాటాల తర్వాత వారు విడుదలైనా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతున్నది. మరి ఇలాంటి సందర్భాల్లో అమాయకులను అక్రమ కేసుల్లో ఇరికించి జైళ్లకు పంపుతున్న వారికి ఎలాంటి శిక్ష విధించాలి? కేసులు పెట్టే వారు దర్జాగా కాలం గడుపుతున్నారు. వారికి ఎలాంటి శిక్షలు పడవు. అధికార దుర్వినియోగంలో పావులుగా మారే వారే ఆ శిక్షలు అనుభవించాల్సి వస్తోంది. బిల్కిస్‌ బానో కేసులో దోషులను తిరిగి జైలుకు పంపితే సగం న్యాయమే లభిస్తుంది. వారికి క్షమాభిక్ష ప్రసాదించిన వారిని గుర్తించి, చేసిన తప్పుకు తగిన శిక్ష విధించినప్పుడే బాధితురాలికి పూర్తి న్యాయం జరుగుతుంది.

Spread the love