గత బడ్జెట్లు గాలిమేడలే..

batti – ఆదాయం లేకున్నా ప్రతి ఏటా 20శాతం పెంపు
– పాత అప్పులు తీర్చేందుకు మళ్లీ కొత్తగా అప్పులు
– భారీ అంకెలు… తక్కువ ఖర్చు
– మా బడ్జెట్‌లో రాబడికి, వ్యయానికి పెద్ద తేడా ఉండదు
– గతం కంటే బడ్జెట్‌ సైతం తగ్గింది
– ఆరుగ్యారంటీలకు, హామీలకు మాదే భరోసా : శాసనసభలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్లన్నీ గాలిమేడల బడ్జెట్లేనని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఆదాయంపై అంచనా లేకుండా ప్రతియేటా బడ్జెట్లలో 20 శాతం పెంచుకుంటూ పోయారని తెలిపారు. రాబడిపై సరైన అంచనాలు లేకపోవడంతో రూ 7 లక్షల కోట్లమేరకు అప్పులు చేశారని చెప్పారు. పాత అప్పులు తీర్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త అప్పులు చేయాల్సి వస్తోందని వివరణ ఇచ్చారు. బడ్జెట్లలో భారీ అంకెలు చూపించారనీ, రాబడి లేకపోవడంతో కేటాయించిన నిధులను ఖర్చు చేయలేని దుస్థితి ఏర్పడిందన్నారు. దీంతో గత బడ్జెట్లు అధికంగా వేతనాలకు, మౌలిక సదుపాయాలకు మాత్రమే సరిపోయాయని చెప్పారు. దళితబంధు, బీసీ బంధు తదితర పథకాలకు నిధుల కొరత ఏర్పడిందని చెప్పారు. గురువారం హైదరాబాద్‌ శాసనసభలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై జరిగిన చర్చకు గురువారం ఆయన సమాధానమిచ్చారు. కాంగ్రెస్‌ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, హామీలను అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. తాము ఆదాయానికి, ఖర్చుకు మధ్య పెద్ద తేడా లేకుండా ఓటాన్‌ అకౌంట్‌ను ప్రవేశ పెట్టామన్నారు. అందుకే గత బడ్జెట్‌ రూ. 2.90 లక్షల కోట్లు ఉంటే, తమ ప్రభుత్వం తగ్గించి రూ.2.75లక్షల కోట్లను మాత్రమే ప్రతిపాదించిందని తెలిపారు.
సమానత్వాన్ని సాధించేందుకే…
‘డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తితో బడ్జెట్‌ ప్రవేశ పెట్టాం. భారత రాజ్యాంగ పీఠిక గుర్తుచేస్తూ…’పౌరులెల్లరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ, న్యాయభావన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధన, స్వాతంత్య్రం, అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చుటమనే స్ఫూర్తితో బడ్జెట్‌ రూపకల్పన చేసినట్టు’ తెలిపారు. ఆదాయ, వ్యయాలను అంచనా వేసి వాస్తవిక బడ్జెట్‌ ప్రవేశ పెట్టామని తెలిపారు. ఇందులో తమకు తాము బేషజాలకు వెళ్లలేదన్నారు.గత పదేండ్లుగా వివిధ సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించిన నిధులు ఖర్చు చేశారా? లేదా? అనే విషయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. 2014 నుంచి 2023 వరకు మొత్తం బడ్జెట్లన్నీంటితో కలిపి రూ. 14,87,834 కోట్లను కేటాయిస్తే…ఖర్చు చేసింది మాత్రం రూ. 12,25,326 కోట్లేనని తెలిపారు. మిగతా రూ. 2,62,518 కోట్లు ఖర్చు చేయలేదని తెలిపారు. 2023-24 వార్షిక సంవత్సరంలో కూడ బడ్జెట్‌లో రూ.70వేల కోట్ల వ్యత్యాసం ఉందన్నారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించి రాబడి లేకపోవడంతో ఎత్తేయడం వల్ల పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం కేటాయించిన సంక్షేమ పథకాలకు కోతపడిందన్నారు. ఆదాయం బాగున్నా…రాష్ట్ర బడ్జెట్‌లో పెట్టిన ఖర్చు 79 శాతం మాత్రమేనని వివరించారు. గత దశాబ్ద కాలంలో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి తదితర వాగ్ధానాలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విస్మరించిందన్నారు.
అంచనాలకు, ఖర్చుకు వ్యత్యాసం ఉండేది
ప్రతి బడ్జెట్‌లో 25 నుంచి 30శాతం వరకు బడ్జెట్‌ అంచనాలకు ఖర్చుకు వ్యత్యాసం ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ సర్కారు బడ్జెట్‌ను పెంచి చూపడం వల్ల గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల రుణాలు ఇవ్వలేదని భట్టి విమర్శించారు. ఇలాంటి పరిస్థితులను తీసుకరావద్దనే ఉద్దేశంతోనే బడ్జెట్‌ను క్రమపద్దతిలో తయారు చేశామన్నారు. ‘సత్యం కంప్యూటర్స్‌ సంస్థ లేని ఆదాయాన్ని, ఉన్నట్టుగా, పెరుగుతున్నట్టుగా చూపించింది. చివరకు అది కుప్పకూలింది’ అని గుర్తు చేశారు. అదే రీతిలో గత బడ్జెట్లు ఉన్నాయని తెలిపారు. పదేండ్లుగా గ్రూప్‌ 1 ఉద్యోగం కోసం నిరుద్యోగులు ఎదురు చూసి గడ్డాలు, మీసాలు పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి తల్లిదండ్రులు కూలీ,నాలీ చేసి కష్టపడి కోచింగ్‌ సెంటర్లకు ఖర్చు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ రాగానే ఉద్యోగాల భర్తీకి రూ.40 కోట్లు విడుదల చేశామన్నారు. ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్ధితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చిందని బీఆర్‌ఎస్‌ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరలో గ్రూప్‌ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
జీఎస్‌జీడీపీకి అనుగుణంగానే రూ. 60వేలకోట్లు బడ్జెట్‌లో చూపించామన్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన చేశామన్నారు. త్వరలో 563 గ్రూప్‌-1 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ వేయబోతున్నట్టు తెలిపారు. ఎల్బీస్టేడియంలో ఏడువేల మంది స్టాఫ్‌ నర్సులకు, సింగరేణిలో కారుణ్య నియామకాల కింద 441 మందికి, 13444 మంది కానిస్టేబుళ్ల, తాజాగా రెండువేల మందికి రెసిడెన్షియల్‌ పాఠశాలలకు సంబంధించిన ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని వివరించారు. ఈ రకంగా రాష్ట్రంలో ఉద్యోగాల జాతర నడుస్తోందన్నారు. రైతు భరోసాకు రూ. 15,175 కోట్లు కేటాయించామన్నారు. చేయూతకు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిధులు కేటాయించినట్టు తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి నెలకు రూ. 300 కోట్లు ఇస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే 15.50 కోట్ల మంది మహిళలు సద్వినియోగం చేసుకున్నారని వివరించారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్తు ఇసామని వివరించారు.

Spread the love