రైతుల ఆందోళన ఉధృతం

Farmers are worried– పంజాబ్‌లో రైలుపట్టాలపై అన్నదాతలు
– రైతులతో చర్చించి సమస్యల పరిష్కారానికి ప్రధాని మోడీ చొరవ చూపాలి : శర్వన్‌ సింగ్‌ పాంథర్‌
– డిమాండ్లు పరిష్కరించేదాక పోరాటం ఆగదు : రైతు నేతలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తూ జరుగుతున్న రైతుల ఆందోళన గురువారం కూడా కొనసాగింది. పంజాబ్‌-హర్యానా సరిహద్దులో ఆందోళనలో రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రైతులతో ప్రధాని నరేంద్ర మోడీ చర్చలు జరిపి వారి డిమాండ్లకు పరిష్కారం చూపాలని పంజాబ్‌ కిసాన్‌ మజ్ధూర్‌ సంఘర్ష్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి శర్వన్‌ సింగ్‌ పాంథర్‌ కోరారు. ప్రధాని మోడీ నేరుగా రైతు నేతలతో సంప్రదింపులు జరపాలని తాము గతంలోనూ కోరామని స్పష్టం చేశారు. తాము శాంతియుతంగా ప్రదర్శన చేపడతామని, బారికేడ్లు పగులకొడతామని తాము చెప్పడం లేదని అన్నారు. మనది ప్రజాస్వామ్య దేశమని, ఢిల్లీలో ప్రశాంతంగా తమ ఉద్యమం చేపట్టేలా అనుమతించాలని కోరారు.
చర్చలకు ముందు..
డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టిన రైతులు కేంద్ర ప్రభుత్వంతో తాజా చర్చలకు ముందు గురువారం పంజాబ్‌లో రైలో రోకో నిర్వహించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత
రైతుల ఆందోళన ఉధృతం కల్పించడంతో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రైతులు పంజాబ్‌, హర్యానాలో ఆందోళనను తీవ్రతరం చేశారు. వీరి నిరసనలతో పంజాబ్‌ సరిహద్దు సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఫిబ్రవరి 16 రాత్రి వరకూ హర్యానా ప్రభుత్వం ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేసింది. కాగా ‘చలో ఢిల్లీ’ ప్రదర్శనలో భాగంగా రైతులు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టుకుంటు ముందుకు సాగుతున్నారు.
రైతుల్ని అడ్డుకునేందుకు.. 30 వేల టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ కోసం ఆర్డర్‌
‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు భారీ ఎత్తున సిద్ధమయ్యారు. పంజాబీ రైతుల్ని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు సుమారు 30 వేల టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ను ఆర్డర్‌ చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్‌ నుంచి వస్తున్న వేలాది మంది రైతుల్ని.. హర్యానా బోర్డర్‌ వద్ద ఆపేశారు. ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో ఆ రైతుల్ని అడ్డుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు సెక్యూరిటీ టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరసనకారుల్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే ఢిల్లీ పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారీ మొత్తంలో టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ను తెచ్చిన పోలీసులు.. మరో 30వేల షెల్స్‌ కోసం ఆర్డర్‌ పెట్టారు. మధ్యప్రదేశ్‌లోని టెక్నాపూర్‌లో ఉన్న టియర్‌ స్మోక్‌ యూనిట్‌ నుంచి ఆ షెల్స్‌ను కొనుగోలు చేయనున్నారు. గ్వాలియర్‌ నుంచి ఢిల్లీకి ఆ షెల్స్‌ తీసుకువస్తున్నారు.
నేడు గ్రామీణ బంద్‌..పారిశ్రామిక సమ్మె
కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి చట్టబద్ధతతోపాటు పలు డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీని ముట్టడించిన రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉధతం చేస్తున్నారు. నేడు గ్రామీణ భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. తమ సమస్యలను ప్రజలకు వివరించి, కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చినట్టు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) ప్రకటించింది. ఈ బంద్‌కు పలు కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. కార్మికులు సమ్మె చేయనున్నారు. 16న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్‌ కొనసాగుతుందని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాతీయ రహదారులను స్తంభింపజేస్తామని తెలిపారు. గ్రామీణ భారత్‌ బంద్‌లో విద్యార్థి, యువత, మహిళ, ఉద్యోగులు పాల్గొన్నారు.
రైతులు పొలాలకు వెళ్లి పని చేయకూడదు: రాకేశ్‌ తికాయత్‌
ఫిబ్రవరి 16న ”భారత్‌ బంద్‌’కు పిలుపునిచ్చిన సందర్భంగా భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నాయకుడు రాకేశ్‌ తికాయత్‌ మాట్లాడుతూ ”మేము గ్రామీణ భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాము. రైతులు నేడు తమ పొలాలకు వెళ్లి పని చేయకూడదు. దీని నుండి కొత్త ఆలోచనా విధానం బయటపడుతుంది. కార్మికులు కూడా సమ్మెకు దిగుతున్నారు. ఉద్యమంలో ఎంత మంది పాల్గొంటున్నారో దీన్ని బట్టి తెలుస్తుంది” అని అన్నారు.

Spread the love