– బీజేపీలో చేరితే ఇబ్బందులు ఉండవన్నారు
– నేను చేరనని చెప్పా…
– తలవంచే ప్రశ్నే లేదు : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ : బీజేపీలో చేరితే ఇబ్బంది పెట్టబోమని తనకు చెప్పారని, అయితే అందుకు తాను అంగీకరించలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఎట్టి పరిస్థితులలోనూ బీజేపీతో చేతులు కలిపే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారు. ఆప్ ఎమ్మెలేలను బీజేపీ ప్రలోభపెట్టిందంటూ కేజ్రీవాల్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ఆయనకు, రాష్ట్ర మంత్రి అతిషికి నోటీసులు జారీ చేసింది. ఆరోపణలకు సంబంధించి సమాచారం ఇవ్వాలని కోరింది. దీనిపై వివాదం కొనసాగుతుండగానే కేజ్రీవాల్ ఆదివారం ఢిల్లీలోని రోహిణిలో ఓ పాఠశాల భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘వారు ఏం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చు. ఏ కుట్ర అయినా చేసుకోవచ్చు. జరిగేదేమీ ఉండదు. నేను వారికి తలవంచే ప్రశ్నే లేదు. నా వైఖరి దృఢంగా ఉంది. బీజేపీలోకి వస్తే ఇబ్బంది పెట్టబోమని వారు చెప్పారు. అయితే ఆ పార్టీలో చేరే ప్రశ్నే లేదు. వారు మమ్మల్ని క్షమించడానికి మేము ఏం తప్పు చేశాం?’ అని ప్రశ్నించారు. పాఠశాలలు, ఆస్పత్రులు, క్లినిక్కులు, రోడ్లను మెరుగుపరచేందుకు కృషి చేస్తున్నామనీ, అందులో తప్పేముందని అన్నారు. ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ కేజ్రీవాల్ చేసిన ఆరోపణకు సంబంధించి మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ క్రైమ్ బ్రాంచ్ అధికారులు శనివారం కేజ్రీవాల్‌కు నోటీసు ఇచ్చారు.
మంత్రి అతిషికి ఆదివారం నోటీసు అందజేశారు. బీజేపీలో చేరితే ఒక్కొక్కరికీ పాతిక కోట్ల రూపాయలు ఇస్తామని, రాబోయే శాసనసభ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ కూడా ఇస్తామని ఆశ చూపుతూ ఆప్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందని గత నెల 27న కేజ్రీవాల్, అతిషి ఆరోపించారు. అయితే ఈ ఆరోపణల్ని బీజేపీ తోసిపుచ్చింది. అవి తప్పుడు ఆరోపణలని, నిరాధారమైనవని తెలిపింది. ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపాలని ముఖ్యమంత్రిని సవాలు చేసింది. బీజేపీ ఆశ చూపిన ఆప్ ఎమ్మెల్యేలు ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు ఆ పార్టీ సీనియర్ నేతలను సంప్రదించారు. ‘క్రైమ్ బ్రాంచ్ విచారణ జరిపింది. ఆప్‌ను వదిలి బీజేపీలో చేరితే పాతిక కోట్ల రూపాయలు ఇస్తామని ఎమ్మెల్యేలకు ఆశ చూపినట్లు మీరు చేసిన ఆరోపణపై ఫిర్యాదు అందింది. మీరు జనవరి 27న సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఈ ఆరోపణని పోస్ట్ చేశారు. మీ ట్వీట్‌ను చదివితే నేరానికి సంబంధించిన సమాచారం మీ వద్ద ఉన్నదని అర్థమవుతోంది. అందువల్ల మీ సమాధానాలు కోరుతూ ఓ ప్రశ్నావళిని జత చేస్తున్నాం. దానికి సోమవారం లోగా సమాధానాలు పంపండి’ అని ఆ నోటీసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సూచించారు.