– కేంద్రప్రభుత్వ నిర్బంధాన్ని ఎదిరిస్తాం
– ఎన్నికల బాండ్లపై తీర్పును స్వాగతిస్తున్నాం : ఏఐకేఎస్, ఏఐఎడబ్ల్యూయూ హన్నన్ మొల్లా, బి.వెంకట్
– ప్రజాకోర్టులోనూ బీజేపీని ఓడిస్తాం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ వ్యాప్తంగా మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఎన్ని నిర్బంధాలు కల్పించినా గ్రామీణ భారత్ బంద్ విజయవంతం చేయాలని జాతీయ కిసాన్ సభ నేత హన్నన్ మొల్లా, ఆలిండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రెటరీ బి.వెంకట్ పిలుపునిచ్చారు. రైతులు, వ్యవసాయ కార్మికులు నేడు చేపట్టనున్న గ్రామీణ భారత్ బంద్, సెక్టోరియల్ సమ్మెకు ట్రేడ్ యూనియన్లు కలిశాయని ఈ సమ్మెతో మోడీని , వారి కార్పొరేట్, మతోన్మాద విధానాలపై పోరాటం కొనసాగిస్తామని అన్నారు. 21 డిమాండ్ల కోసం సమిష్టిగా పోరాడుతున్నారని తెలిపారు.
రైతుల్ని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్న మోడీ
రైతులకు బీజేపీ ప్రభుత్వం పదేండ్ల క్రితం నుంచి ఇచ్చిన హామీలను అమలు చేయమంటే రైతులను పోలీసు, పారా మిలటరీ దళాలు పెట్టి, రోడ్లపై మేకులు తెచ్చి, కంచెలు వేసి అడ్డుకుంటోందని, ఇంటర్నెట్ బంద్ చేసి, రైతులపై లాఠీచార్జీ చేయిస్తోందని, వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తోందని వారు అన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో న్యాయ సమ్మతమైన డిమాండ్స్ కోసం ఆందోళన చేస్తున్న రైతులపై మోడీ ప్రభుత్వం నిరంకుశత్వం ప్రదర్శిస్తూ కాశ్మీరీలపై వాడిన పెలెట్స్ రైతులపై వాడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాది హామీ బడ్జెట్ రూ. 2 లక్షల కోట్లకు పెంచాలని, ఉపాధి హామీ పని దినాలు 200 రోజులకు పెంచాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలనే డిమాండ్స్ ఈ బంద్‌లో ఉన్నాయని చెప్పారు.
స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయకుండా ఆయనకు భారతరత్న ప్రకటించడం వెనుక కేవలం రాజకీయ కారణాలు ఉన్నాయని అన్నారు. ఆయన కుమార్తె ఆర్ధిక వేత్త మధుర స్వామినాధన్ రైతులకు సి2 మద్దతు ధర, రైతుబీమా లాంటి పథకాల ద్వారా రైతుల ఆర్ధిక పరిస్థితులు మెరుగుపర్చాలని అలా చేసినప్పుడు మాత్రమే ఆయనకిచ్చిన భారతరత్న లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. శుక్రవారం తలపెట్టిన బంద్ విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ చర్చల పేరుతో మంత్రుల కమిటీ పేరుతో కాలయాపన చేస్తుందని, ఎన్ని ప్రయత్నాలు చేసినా భారత్ బంద్ విజయవంతం చేసి తీరుతామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో కిసాన్ సభ జాతీయ కమిటీ సభ్యులు మనోజ్ వీరితో పాటు పాల్గొన్నారు.
ఎన్నికల బాండ్లపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం
దేశంలో నల్లధనాన్ని నివారించే పేరుతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల బాండ్లు సేకరించాలని తెచ్చిన విధానం పై సర్వోన్నత న్యాయస్థానం తీసుకున్న చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నామని .గురువారం నాడిక్కడ ఏపీ, తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరినిచ్చినట్లుగా ఉందని అన్నారు. సర్వోన్నత న్యాయస్థానమే రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ నిర్ణయం కేంద్రం చేసిందని వ్యాఖ్యానించడం అంటేనే బీజేపీ కార్పొరేట్ల పార్టీ అని తేలిందని తెలిపారు. మోడీ ప్రభుత్వాన్ని కార్పొరేట్లు నడిపిస్తున్నారని, సాధారణ ప్రజానీకం ఓట్లను కొనుగోలు చేయడానికి లక్షల కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్ల పేరుతో బీజేపీ నిధులను సిద్ధం చేసిందని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల ప్రజాకోర్టులోనూ మోడీ ప్రభుత్యాన్ని ఓడిస్తామని అన్నారు.
2018లో బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే ముందు పారదర్శకంగా ఉండాలనే పేరుతో ఈ బాండ్లు తెచ్చి పారదర్శకంగా లేకుండా మోడీ ప్రభుత్వం నిధులు సేకరించుకుందని అన్నారు. కమిషన్లు తీసుకుని విరాళాలు ఇచ్చిన, ఇస్తున్న కార్పొరేట్ల సేవలు చేసేందుకు మోడీ ఉన్నారని సుప్రీం సంచలన తీర్పు వల్ల ప్రజాస్వామ్యం, పారదర్శకత ఉంటుందని తెలిపారు.