గురుకులాలన్నీ ఒకే గొడుగు కిందకు

All Gurukulas under one umbrella– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లలు ఒకే చోట చదువుకునేలా ఏర్పాట్లు
– 20ఎకరాల్లో కొడంగల్‌లో పైలట్‌ ప్రాజెక్టు
– 70 రోజుల్లోనే 25వేల ఉద్యోగ నియామకాలు చేపట్టాం : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
– ప్రభుత్వ గురుకులాల ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేత
నవతెలంగాణ-సిటీబ్యూరో
”రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుకునేందుకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. మరి వాటిల్లో కనీస మౌలిక వసతుల్లేక.. ఆడపిల్లలు ఆవస్థలు పడుతుంటే కంటికి కనిపించ లేదా. వందలాది ఆడబిడ్డలు టాయిలెట్లు లేక లైన్‌లో ఉండి వెళ్తున్న దుస్థితి కనిపించ లేదా. మన బిడ్డలో.. మన అక్కో.. చెల్లో అలా ఇబ్బంది పడితే చూస్తూ ఊరుకుంటామా. వారి కోసం వసతులు ఏర్పాటు చేయాలన్న బాధ్యత ప్రభుత్వాలపై లేదా.. లక్షల కోట్ల బడ్జెట్‌ కలిగిన మిగులు రాష్ట్రమైన తెలంగాణలో పదేండ్ల కాలంలో రూ.15.5లక్షల కోట్లు కేసీఆర్‌ చేతికి వచ్చినా ఎందుకు ఆ పిల్లలకు వసతులు ఏర్పాటు చేయలేదు” అని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అందుకే గురుకుల పాఠశాలలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొస్తామని చెప్పారు. 20ఎకరాల్లో ఒకే క్యాంపస్‌లో అన్ని రకాల గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని, కొడంగల్‌లో దీన్ని పైలట్‌ ప్రాజెక్టుగా చేపడుతున్నామని చెప్పారు. ”ఈ మోడల్‌ను అన్ని నియోజకవర్గాల్లో ఆచరణలోకి తీసుకొస్తాం. ఇందుకు కావాల్సిన స్థలాలను సేకరించాలని వేదికపై నుంచే అధికారులను ఆదేశిస్తున్నా’ అని అన్నారు. కొత్తగా నియామకమైన ప్రభుత్వ గురుకులాల ఉపాధ్యాయులకు(పీజీటీలు, పీడీలు, లైబ్రేరియన్లు) నియామక పత్రాలను గురువారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, సీఎస్‌ శాంతి కుమారితో కలిసి సీఎం అందజేశారు.
అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగ నియామకాల విషయంలో పదేండ్లు బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం వహించిందన్నారు. 30లక్షల మంది నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం నియామకాలు చేపడుతున్నామని చెప్పారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. ”త్వరలోనే గ్రూప్‌-1 పరీక్ష నిర్వహిస్తాం. 3,650 రోజులు అధికారంలో ఉండి మీరు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు. తమ ప్రభుత్వం ఏర్పడిన 70 రోజుల్లో 25వేల ఉద్యోగాల నియామకాలు చేపట్టాం.. మీరు ఉరితాళ్లు కట్టుకుని వేలాడినా.. ఇంకేం చేసినా.. ప్రజలు మీపై సానుభూతి చూపరని” అన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో తండాలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న 6,450 పాఠశాలలను మూసేశారని, పేదలకు విద్యను దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో మెగా డీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టి పేదలకు విద్య అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమ ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుంటే.. మామా అల్లుళ్లు మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారన్నారు. నువ్వు రాజీనామా చెరు నేను చేసి చూపిస్తా అని హరీశ్‌రావు అంటున్నారని, ఆయనను చూస్తుంటే.. మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. పదేండ్లు మంత్రిగా ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. మేడిగడ్డపై చర్చకు అసెంబ్లీకి రమ్మంటే రాకుండా పారిపోయిండ్రని.. దశ బాగుంటే దిశతో పని లేదన్నారు. ప్రజలకు ఏం ద్రోహం చేశారో ఇప్పటికైనా కేసీఆర్‌ తెలుసుకోవాలని సూచించారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. 1971లో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పీవీ నరసింహారావు సర్వైల్‌లో గురుకుల పాఠశాలను ప్రారంభించారని, ఆ గురుకులంలో నుంచి వచ్చిన బుర్ర వెంకటేశం, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ వంటి ఎంతోమంది ఐఏఎస్‌, ఐపీఎస్‌లతో పాటు విదేశాల్లోనూ ఎంతోమంది ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు. అప్పట్లో 32 ఉంటే.. ఇప్పుడు రాష్ట్రంలో 1022 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు ఉన్నాయన్నారు. దాదాపు 6.85లక్షల మంది విద్యార్థులు చదివే సంస్థలుగా గురుకులాలు ఎదిగాయన్నారు. 2004-14 మధ్య మెస్‌ చార్జీలు అన్నీ గ్రీన్‌ చానల్‌ ద్వారా పేమెంట్‌ అయ్యేవని, 2014 తర్వాత రెండేండ్ల వరకు మెస్‌ చార్జీలు రాక నాణ్యత కొరవడిందన్నారు. సీఎం నాయకత్వంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల ప్రతి మెస్‌ చార్జీలను గ్రీన్‌ ఛానల్‌ ద్వారా ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామన్నారు. తమ ప్రభుత్వానికి అండగా ఉండాలని, కొత్తగా నియామక పత్రాలు అందుకున్న ఉపాధ్యాయులు పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే 25వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు.. పనిచేసే ప్రభుత్వం అని తెలిపారు.

Spread the love