హైదరాబాద్‌లో ఆంక్షలు.. హద్దులు దాటితే జైలే..!

నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో సోమవారం(మే13)నాడు లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు ఆంక్షలు విధించారు. రోడ్లపై జనం ఎక్కువ మంది గుమిగూడటంపై ఆంక్షలు విధిస్తూ మూడు కమిషనరేట్లకు సంబంధించిన పోలీస్ కమిషనర్‌లు ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల నుంచి 14న ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టంచేశారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు ప్రకటించారు. పోలింగ్ కేంద్రం పరిధిలో ఐదుగురు అంతకుమించి గుమిగూడవద్దని పోలీసులు స్పష్టం చేశారు.
రేపు సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు అన్ని రకాల ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమల్లో ఉంటుందని తెలియజేశారు. ఏ లైసెన్సు కింద అనుమతి ఉన్నప్పటికీ మద్యం విక్రయాలపై ఆంక్షలు ఉంటాయని స్పష్టంచేశారు. 13వ తేదీన పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన ఓటర్లు రెండు క్యూలైన్లలో నిలబడాలని.. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా క్యూలైన్‌లు ఉంటాయని పోలీసులు తెలిపారు. రెండు కంటే ఎక్కువ లైన్లలో ఉండటాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని చెప్పారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని పోలీస్‌ కమిషనర్‌లు హెచ్చరించారు.
ఆంక్షల సమయంలో మైకులు, స్పీకర్ల ద్వారా పాటలు పెట్టడం, ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు చేయడం నిషిద్ధమని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో షామియానాలు, పందిళ్లు వంటి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడానికి అనుమతి లేదన్నారు. వ్యక్తులు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్లకార్డులు, చిత్రాలు, గుర్తులు ప్రదర్శించడం నిషేధమని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలకు కిలోమీటర్‌ దూరంలో కర్రలతో కూడిన జెండాలు, తుపాకులు, మారణాయుధాలతో సంచరించడం నిషేధమని పేర్కొన్నారు. ఆత్మరక్షణ పేరుతో కర్రలు, తుపాకులు, మారణాయుధాలు వినియోగించరాదని పోలీసులు తెలిపారు.

Spread the love