కాంగ్రెస్ నేతలకు చేతకాదు : కేటీఆర్

నవతెలంగాణ హైదరాబాద్‌: మిషన్‌ భగీరథ నిర్వహణ కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తెలియదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..   గతేడాది వర్షాలు బాగా కురిశాయని ఐఎండీ చెప్పింది. పార్టీ గేట్లు ఎత్తడం కాదు.. ప్రాజెక్టు గేట్లు ఎత్తండి. ఫోన్‌ ట్యాపింగ్‌పై కాదు.. వాటర్‌ ట్యాపింగ్‌పై దృష్టి పెట్టాలని అన్నారు. హైదరాబాద్‌ నగరంలో పదేండ్లుగా తాగునీటి కష్టాలు లేవని తెలిపిన ఆయన.. నేడు ఇక్కడ ట్యాంకర్ల దందా జోరుగా నడుస్తోందన్నారు. మళ్లీ ఇన్వర్టర్లు, జనరేటర్లు వినియోగంలోకి వచ్చాయని ఎద్దేవా చేశారు. మారుమూల తండాల్లోనూ తాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌ది అని అన్నారు. వేసవి ఆరంభంలోనే ఎద్దడి మొదలైందని.. మరో రెండు నెలలు ఎండలు ఉంటాయని చెప్పారు. ఇదంతా కాంగ్రెస్‌ ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరత అన్నారు.
సాగర్‌, సింగూరు, ఎల్లంపల్లి, ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌లో నీళ్లు ఉన్నాయి. చుట్టూ నీళ్లు ఉండగా హైదరాబాద్‌ వాసులు ఎందుకు కొంటున్నారు? మీకు ఓటు వేయలేదని నగర ప్రజలపై కక్ష కట్టారా? సాగర్ నుంచి 14 టీఎంసీలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వానికి నీటి నిర్వహణ చేసే తెలివి లేదు. సాగునీరు ఇవ్వకుండా పంటలు ఎండిపోయేలా చేశారు. కాళేశ్వరం నుంచి జల పరవళ్లు వస్తున్నాయి. పంటలు ఎండిపోవాలనేదే కాంగ్రెస్‌ ఉద్దేశం. పంటలు పండితే బోనస్‌ ఇవ్వాల్సి వస్తుందనే ఇలాంటి కుట్రలు అని ఆయన ఆరోపించారు.

Spread the love