నేడు ఇందిరాపార్కు వద్ద మహాధర్నా

– భారీగా తరలిరానున్న ఐకేపీ వీఓఏలు
– రూ.3,900 వేతనంతో బతికేదెలా అంటూ ప్రశ్నిస్తున్న వైనం
– 42 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోని సర్కారు
– అణచివేతకే సర్కారు మొగ్గు..సడలని ధైర్యంతో వీఓఏలు ముందుకు
– వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి పెరుగుతున్న మద్దతు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరితో వీఓఏల పోరాటం తీవ్రరూపం దాల్చుతున్నది. ఇన్ని రోజులు మండల, జిల్లా కేంద్రాలకే పరిమితమైన వారి పోరాటం పట్నం చేరుకుంటున్నది. రూ.3,900 వేతనంతో ఎలా బతకాలని ప్రశ్నిస్తూ 42 రోజులుగా ఐకేపీ వీఓఏలు చేస్తున్న పోరాటం పట్ల ఎప్పట్లాగే రాష్ట్ర సర్కారు సమ్మెల పట్ల వ్యవహరిస్తున్న నిరంకుశ తీరునే ప్రదర్శిస్తున్నది. వారి న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న సమ్మెకు రోజురోజుకీ మద్దతు పెరుగుతున్నా సర్కారులో మాత్రం చలనం కరువైంది. బంతి గోడకేసి ఎంత గట్టిగా కొడితే అంతే తీవ్రతతో వెనక్కి వచ్చినట్టుగానే..రాష్ట్ర సర్కారు అణిచివేత, తీవ్ర నిర్బంధం, బెదిరింపులతో విసిగివేసారిన వీఓఏలు తమ పోరాట ఉధృతిని మరింత పెంచుతున్నారు. అందులో భాగంగానే వారు సోమవారం నాడు చలో ఇందిరాపార్కు వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చారు. వేలాది మంది వీఓఏలు ఈ ధర్నాకు తరలివచ్చే ఏర్పాట్లను చేసుకున్నారు. అయితే, రాష్ట్ర సర్కారు ఎప్పట్లాగే వీఓఏలను హైదరాబాద్‌కు రాకుండా సామదానదండోపాయాలను ప్రదర్శిస్తున్నది. సర్కారు ఎన్ని కుట్రలు పన్నినా మహాధర్నాను విజయవంతం చేసి తమ పోరాటాన్ని రాష్ట్ర ప్రజలందరిలోకీ తెలిసేలా చేసేందుకు వీఓలు కంకణబద్ధులై కదులుతున్నారు.
సమ్మెలోకి ఎందుకెళ్లారు?
రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌)లో గ్రామ స్థాయిలో 17,606 మంది వీఓఏలు (గ్రామ సంఘాల సహాయకులు) 19 ఏండ్ల నుంచి పనిచేస్తున్నారు. ఊర్లల్లో మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేస్తూ మహిళలు ఆర్ధికంగా, సామాజికంగా ఎదగడానికి వారికి అవగాహన కల్పిస్తున్నారు. మహిళలు సొంతకాళ్లపై నిలబడేందుకు బ్యాంకుల ద్వారా తీసుకున్న లోన్లను సక్రమంగా చెల్లించడంలో వీరిదే కీలకపాత్ర. ఎవరైతే లోన్లు సరిగా కట్టరో వారి దగ్గరకెళ్లి అర్ధమయ్యే రీతిలో వివరించి కట్టేలా చేస్తున్నారు. డ్వాక్రా మహిళా సంఘాలు నిర్వహిస్తున్న లావాదేవీలన్నీ పుస్తక నిర్వహణ చేస్తూ ఎస్‌హెచ్‌జి లైవ్‌ మీటింగ్‌ పెట్టి ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తున్నారు. సంక్షేమపథకాలు ప్రజలకు అందడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. సర్వేలలో వీరిని రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటున్నది. ఇంత కష్టపడుతున్నప్పటికీ వీఓఏలకు సెర్ప్‌ నుంచి రూ.3,900 గౌరవ వేతనమే దక్కుతున్నది. ఎంతోమంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేసిన రాష్ట్ర సర్కారుకు 19 ఏండ్ల నుంచి పనిచేస్తున్న వీరు కనిపించకపోవడం బాధాకరం. అంత తక్కువ వేతనంతో బతకడం కష్టమవుతున్న నేపథ్యంలో తమను పర్మినెంట్‌ చేసి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని వీఓఏలు డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. అదే సమయంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పలు అంశాలనూ రాష్ట్ర సర్కారు దృష్టి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని పలుమార్లు వేడుకున్నారు. అనేక పోరాటాలు చేశారు. అయితే, రాష్ట్ర సర్కారు మాత్రం వీరి విషయంలో సానుకూలంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే ఐకేపీ వీఓఏలు సమ్మెలోకి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు, అణచివేత చర్యలు, బెదిరింపులకు పాల్పడినా వీఓఏలు 42 రోజులుగా తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఏప్రిల్‌ 17 నుంచి నిరవధిక సమ్మెతో పాటు భిక్షాటనలు, రోడ్లు ఊడ్చటాలు, రిలే దీక్షలు, నిరసనలు, వంటావార్పు, జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేస్తూనే ఉన్నారు. కలెక్టరేట్ల ముట్టడి సందర్భంగా ముందస్తు అరెస్టులు, లాఠీ ఛార్జీలు చేయడం, మహిళలను మగ పోలీసులు పిడి గుద్దులు గుద్దడం లాంటి అమానుష చర్యలకు రాష్ట్ర సర్కారు పాల్పడింది.
గొంతెమ్మ కోరికలేం కాదు..పరిష్కరించాల్సిందే
ఎస్వీ.రమ, తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం(సీఐటీయూ) గౌరవాధ్యక్షులు
’19 ఏండ్ల నుంచి పనిచేస్తున్న వీఓఏలు తమను పర్మినెంట్‌ చేయాలని అడగటం నేరమా? రూ.3,900తో బతకలేం జీతం పెంచాలనటం తప్పా? అరకొర వేతనాలతో బతుకులీడుస్తున్న తమ కుటుంబాలకు ఆరోగ్య బీమా, సాధారణ బీమా సౌకర్యాలు అడగకూడదా? చిన్న సంస్థలో పనిచేస్తుంటే గుర్తింపుగా ఐడీ కార్డులిస్తున్న రోజులువి. 19 ఏండ్ల నుంచి పనిచేసేటోళ్లకు సెర్ప్‌ ఐడీ కార్డు ఇవ్వదా? అందరికీ నేరుగా ఖాతాల్లోనే వేతనాలు వేసినట్టుగానే తమకూ జీతాలు చెల్లించాలని అడగటం అన్యాయమా? రోజుకో కొత్త పని చేయిస్తూ వేధించడం సరిగాదు..
తమకంటూ ఓ జాబ్‌ చార్టు ఇవ్వండి అని అడగటం కూడా తప్పా? ప్రమోషన్లు అడగటం, ఆన్‌లైన్‌ పనులు తమతో చేయించొద్దనటం న్యాయం కాదా? వీఓఏలు గొంతెమ్మకోరికలేం కోరట్లేదు. వారి డిమాండ్లన్నీ న్యాయబద్ధమైనవే. వాటిని పరిష్కరించాల్సిందే. లేకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం.’

Spread the love