
జిల్లాతో పాటు జిల్లా చుట్టుప్రక్కల గల నిర్మల్, మెట్పల్లి ప్రాంతాల్లో ఏండ్లుగా రైతులు ముండ్ల జొన్న పంటను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది సుమారు 20 వేల ఎకరాల్లో ముండ్ల జొన్న పంట సాగవుతుంది. ముండ్ల జొన్నలను ఆయా సీడ్ కంపెనీల యజమానులు సీడ్ ఆర్గనైజర్లతో కలిసి రైతుల చేత పంటను సాగు చేయిస్తూ తిరిగి కొనుగోలు చేస్తుంటారు. ఈ ఏడాది ముండ్ల జొన్న పంటను సాగు చేసిన రైతులను నిండా ముంచేందుకు సీడ్ ఆర్గనైజర్లతో కలిసి సీడ్ కంపెనీల యజమానులు కుయుక్తులు పన్నుతున్నారు. ముండ్ల జొన్న పంట క్వింటాల్ కు 4 వేల ధరలోపే చెల్లించేందుకు సీడ్ ఆర్గనైజర్లతో కలిసి ముండ్ల జొన్నలకు అంత డిమాండ్ లేదు 4000 లోపే ధర వస్తుందంటూ రైతులను నమ్మిస్తూ పంటను కొనుగోలు చేసేందుకు జిల్లాలోని సీడ్ ఆర్గనైజర్లు సిద్ధమవుతున్నారు. రైతులు చాకచక్యంగా ఆలోచించి ముండ్ల జొన్న ధరలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకొని మోసానికి గురికాకుండా పంటను రెండు మూడు రోజులు నిలువ చేసుకొనైనా మంచి ధర వచ్చిన సమయంలోనే అమ్మాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ముండ్ల జొన్నకు క్వింటాల్ కు 4300 తో ఆర్మూర్లో ఒప్పందం: మున్సిపల్ పట్టణ కేంద్రంలోని సత్యసాయి సీడ్ కంపెనీ యజమాని యామాద్రి భాస్కర్ ఆర్మూర్ ప్రాంతంలో వారి సీడ్ కంపెనీ ద్వారా రైతులకు అందించిన ముండ్ల జొన్న పంట దిగుబడులను క్వింటాల్ కు 4300 చొప్పున కొనుగోలు చేసేందుకు ఇటీవల ఆర్మూర్ లో రైతులతో ఒప్పంద మైంది. ముండ్ల జొన్నలను తేమ శాతం 12 వచ్చేవరకు ఎండబెట్టాలని, క్వింటాలుకు 6 కిలోల కడతా చొప్పున రైతులతో ఒప్పందం అయినట్టు సత్యసాయి సీడ్ కంపెనీ యజమాని యామాద్రి భాస్కర్ మంగళవారం నవ తెలంగాణకు తెలిపారు.