అమరావతి : తెలుగు జర్నలిజంలో ప్రతిష్టాత్మకమైన మోటూరు హనుమంతరావు (ఎంహెచ్) స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డుకు ఎంట్రీల కోసం ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ప్రకటన విడుదలైంది. ప్రజాశక్తి సాహితీ సంస్థ కార్యదర్శి ఎంవిఎస్ శర్మ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ‘మోటూరు హనుమంతరావు (ఎంహెచ్) స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డు-2025’కు ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.ఉత్తమ వార్తా కథనాలు, ఫీచర్లు రాసిన వారిని గుర్తించి అభినందించడానికి సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి నేతృత్వంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసరు జి అనిత, సీనియర్ జర్నలిస్ట్, కవి నల్లి ధర్మారావుతో కూడిన ఎంహెచ్ అవార్డు కమిటీ నిర్ణయించిందని తెలిపారు. గత కొన్నేళ్లుగా అప్రతిహతంగా సాగుతున్న ఈ బృహత్తర ప్రయత్నంలో భాగంగా ఈ ఏడాది కూడా ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్లు ఎంవిఎస్ శర్మ తెలిపారు. 2025 జూన్ 30లోగా ఎంట్రీలు తమకు చేరేలా పంపాలన్నారు.
బాధాసర్పదష్టుల కథనాలే….
‘మహిళలు, పిల్లలు, దళితులు, వికలాంగులు, బడుగు, బలహీనవర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, సమాజంలో వీరి సమస్యలు, సవాళ్లు ప్రత్యేకమైనవి. వీరి అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రకటిస్తున్నా ప్రగతి పరిమితంగానే ఉంటోంది. ఆయా వర్గాలు అత్యధికంగా అసమానతలు, అత్యాచారాలకు, ఆధిపత్యాలకు బలయ్యే ఘటనలు వింటూనే ఉన్నాం. పత్రికల్లో వీరి సమస్యలపై ఎప్పుడూ ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో విలేకరుల పాత్ర కీలకం. సమాజంలో ఇతరులతో పాటు వారికీ సమానస్థాయి కల్పించడానికి జర్నలిస్టులు కృషి చేస్తూనే ఉన్నారు. అయినా బయటకు రాని వాస్తవాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా తరగతులకు సంబంధించిన ఉత్తమ వార్త కథనాలు, ఫీచర్లు రాసిన వారిని ఈ ఏడాది గుర్తించి అభినందించనున్నాం’ ‘ అని ఎంవిఎస్ శర్మ తెలిపారు.
ఎంట్రీలు ఎలా పంపాలి?
ఎంట్రీలు పంపదలచిన వారు కార్యదర్శి, ప్రజాశక్తి సాహితీ సంస్థ, ప్రజాశక్తి భవనం, అమరారెడ్డి కాలనీ, తాడేపల్లి, గుంటూరు జిల్లా, పిన్‌కోడ్ 522501 నెంబరుకు కానీ, లేక psmhaward@gmail.com మెయిల్‌కు పంపాలన్నారు. కథనాలు 2024 జూన్ ఒకటి నుంచి 2025 మే 31 మధ్యలో తెలుగు పత్రికల్లో ప్రచురితమై ఉండాలన్నారు. న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయమని, ఎంపికైన వారికి ప్రజాశక్తి సాహితీ సంస్థ ప్రశంసాపత్రంతో పాటు నగదు బహుమతి అందజేస్తామన్నారు.
ఎంహెచ్ స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డు-2025కు ఎంట్రీల ఆహ్వానం…
- Advertisement -
- Advertisement -