– న్యాయం కోసం రేవంత్ సర్కారువైపు ఎదురుచూపులు
– రెండు పూటలా ఫొటోలనే కేంద్రం మెలికతో ఇబ్బందులు
– బీఆర్‌ఎస్ పాలనలో మూడేండ్లు తొలగించి ముప్పుతిప్పలు
– కొత్తసర్కారు తమను పట్టించుకోవాలని వేడుకోలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టం నిర్వహణలో కేత్రస్థాయిలో ఫీల్డు అసిస్టెంట్లదే కీలక పాత్ర. అలాంటి వారిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెట్టింది. మూడేండ్లపాటు విధుల నుంచి తొలగించి అరిగోస తీయించింది. ‘కాళ్లుమొక్కుతాం విధుల్లో తీసుకోండి’ అని బతిమాలించుకున్నది. ప్రభుత్వంపై ఎక్కడ ప్రజల్లో వ్యతిరేకతను నూరిపోస్తారో అన్న భయంతో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు విధుల్లోకి తీసుకున్నది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పని ప్రదేశం నుంచి ఉపాధి హామీ కూలీల ఫొటోలను రోజుకు రెండు సార్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని తీసుకొచ్చిన నిబంధన వారికి ప్రాణసంకటంగా మారింది. క్షేత్రస్థాయిలో ప్రజలతో నిత్యం సంబంధముండే తమ పట్ల రాష్ట్ర సర్కారు వ్యవహరించిన తీరు..మరోవైపు కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచుతామని హామీ ఇవ్వడంతో ఫీల్డ్ అసిస్టెంట్లంతా ఒక్కటై కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించేందుకు తమ వంతు ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ సర్కారు వచ్చినా ఫీల్డు అసిస్టెంట్లు వ్యథలు మాత్రం మారలేదు. తమ సమస్యలపై ఇప్పటికే ఫీల్డ్ అసిస్టెంట్లు ఎమ్మెల్యేలకు, మంత్రులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేశారు. మొన్నటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ‘మీరు పదేపదే హైదరాబాద్‌కు వచ్చి డబ్బులను వృథా చేసుకోవద్దు. మీ సమస్య మా దృష్టిలో ఉంది. కచ్చితంగా పరిష్కరిస్తాం. అవసరమైతే ఫీల్డు అసిస్టెంట్ల బృందంతో మాట్లాడి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకెళ్తాం’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తమకు చెప్పిందని పలువురు ఫీల్డు అసిస్టెంట్లు చెప్పారు. ఆ సమావేశాలు అయిపోయి నెల కావస్తున్నా ఇప్పటి వరకూ ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారం విషయంలో ఒక్కడు అడుగు కూడా ముందుకు పడలేదు. రేవంత్‌రెడ్డి సర్కారు తమకు న్యాయం చేస్తుందనే కొండంత ఆశతో ఫీల్డు అసిస్టెంట్లు ఎదురుచూస్తున్నారు.
కేంద్రం తెచ్చిన కొత్త తంటా
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి ఏటేటా నిధులను తగ్గిస్తూ నిర్వీర్యం చేయడానికి పూనుకున్నది. కొత్తకొత్త నిబంధనలు తీసుకొచ్చి కూలీలే పనులకు దూరమయ్యేలా చేస్తున్నది. అందులో భాగంగానే ప్రతిరోజూ రెండుపూటలా కూలీల అంటెండెన్స్ ఆన్‌లైన్‌లో ఫేస్ రికగనైజ్డ్ ద్వారా తీసుకోవాలనే నిబంధన ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రాణసంకటంగా మారుతున్నది. ఉన్నతాధికారులు కేవలం సిమ్‌కార్డు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ‘సెల్‌ఫోన్‌లో కెమెరా మంచిగా లేకుంటే ఫొటోలు సరిగారావడంలేదు. అటెండెన్స్ పూర్తికాదు. దీంతో అప్పుచేసి రూ.20 వేలు పెట్టి ఫొటోలు బాగా వచ్చే కొత్త ఫోన్ కొన్నాను. ఊర్లల్లో సిగల్ కూడా సరిగా ఉండటం లేదు. నెట్ బ్యాలెన్స్ కూడా మేమే వేయించుకోవాల్సి వస్తున్నది’ అంటూ నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఫీల్డ్ అసిస్టెంట్ తన బాధలను పంచుకున్నాడు. ‘మా ఊరిలో ఐదారేండ్ల కిందటి దాకా 500 మంది దాకా ఉపాధి పనులకు వచ్చేవారు. ఆ సంఖ్య ఏటేటా తగ్గిపోతున్నది. ఇప్పుడు రోజుకు 50 మంది కూడా రావడం లేదు’ అని మహబూబ్‌నగర్ జిల్లాలో భూత్పూర్ మండలానికి చెందిన ఓ ఫీల్డు అసిస్టెంటు ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు కూలీలు పనికి రావడం లేదని ఉన్నతాధికారులు ఫీల్డ్ అసిస్టెంట్లను వేధిస్తున్నారు. కూలీల హాజరుశాతాన్ని బట్టి గ్రేడులు విడగొట్టి ఇచ్చే పదివేల రూపాయల్లోనూ తెగ్గోస్తున్నారు.
జీతాలు రాక మూడు నెలలు దాటే..
కూటి కోసం కోటి విద్యలు. ఎవరైనా ఎంతో కొంత జీతం వస్తే దానిపై ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొస్తారు. పొద్దస్తమానం పనిప్రదేశాల చుట్టూ పనులను పర్యవేక్షించడం, కూలీలకు సౌకర్యాలు కల్పించడం, కొలతలు వేయడం, ఆన్‌లైన్‌లో హాజరు నమోదు చేయడం వంటి పనులను ఫీల్డ్ అసిస్టెంట్లుమ చేస్తున్నారు. ఇంత పనిచేస్తున్నా వారికి నెలనెలా జీతం రావడం లేదు. రాష్ట్రంలో 7500 మందికిపైగా ఎఫ్‌ఏలుండగా..వారికి రాష్ట్ర సర్కారు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. ఇచ్చే పదివేల రూపాయలు చేతికందకపోవడంతో అప్పులు చేసి బతుకుతున్న ధైన్యపరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగ భద్రత కల్పిస్తాం..వేతనాలు పెంచుతాం అని హామీనిచ్చింది. కానీ, అది నేటికీ పట్టాలెక్కలేదు. పైగా, వేతన బకాయిలు కూడా పెండింగ్‌లో ఉంటున్న పరిస్థితి. ఉపాధి హామీ చట్టంలో క్షేత్రస్థాయిలో కూలీలతో పనిచేయిస్తూ రాష్ట్రానికి కేంద్రం నుంచి అధిక నిధులు తెప్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్న తమను రేవంత్‌రెడ్డి సర్కారు ఆదుకోవాలని కోరుతున్నారు.