– మే అంతా అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు సెలవులివ్వండి
– స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు మార్చినెలకు సంబంధించిన జీతాలను తక్షణమే చెల్లించాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్ల యూనియన్ (సీఐటీయూ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మే నెలంతా వారికి ఒకేసారి సెలవులివ్వడంపై తొందరగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఈ మేరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ను సోమవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె సునీత, ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి, కోశాధికారి పి మంగ కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈనెల ఎనిమిదో తేదీ వచ్చినా గతనెల వేతనాలు ఇంకా రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగాది, రంజాన్ పండుగలున్నాయని వివరించారు. పండుగల నేపథ్యంలో వేతనాలు సకాలంలో ఇవ్వకపోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని పేర్కొన్నారు. చాలీచాలని వేతనాలు అవీ సకాలంలో రాకపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా అంగన్‌వాడీ కేంద్రాలకు ఒకపూట బడిని నిర్ణయిస్తూ సర్క్యులర్‌ను జారీ చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.
వచ్చేనెలంతా సెలవులు ఇవ్వడంపైన ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. దీంతో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు అసంతృప్తికి గురవుతున్నారని తెలిపారు. ఎండల తీవ్రత, అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల్లేకపోవడం, పెద్ద పిల్లలు ఇంట్లో ఉన్నపుడు చిన్న పిల్లలు ఎంత బలవంతం చేసినా కేంద్రాలకు రాకపోవడం తదితర సమస్యలు వేధిస్తున్నాయని వివరించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 24 రోజులపాటు సమ్మె సందర్భంగా వచ్చేనెల సెలవులపైన గత ప్రభుత్వం ఇచ్చిన హామీలనూ అనేకసార్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ దృష్టికి తెచ్చామని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని తెలిపారు.