నవతెలంగాణ – వలిగొండ రూరల్
నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాడుతున్న సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య ప్రజలను కోరారు. సోమవారం పొద్దుటూరు గ్రామంలో సీపీఐ(ఎం) ఎంపీ అభ్యర్థి జహంగీర్ గెలుపు కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ పార్లమెంట్ పరిధిలో అనేక ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా నేటికీ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయని ఆ సమస్యల పరిష్కారం కోసం నికరంగా నిలబడి పోరాడుతున్న సీపీఐ(ఎం) ఎంపీ అభ్యర్థి జహంగీర్ కు ఓటు వేసి ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా గెలిపించాలని కోరారు. మూసి పరివాహక ప్రాంతంలో కాలుష్య సమస్యతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, మూసి జల కాలుష్యాన్ని అరికట్టాలని మూసి పరివాహక ప్రాంతంలో గోదావరి జలాలను అందించాలని కోరారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్త ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర ఉందని ప్రజల కోసం పోరాడే వారికి అవకాశం ఇస్తే సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ప్రజలు ఒక్కసారి ఆలోచించి పదవుల కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఓడించి సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించాలని కోరారు. దేశంలో బీజేపీ రెండోసారి అధికారం వచ్చిన తర్వాత పేదలు మరింత పేదలుగా మారారని, రైతులు కూలీలుగా మారారని వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటుపరం చేయడం కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా ఎండగట్టాలని ప్రజల కోసం పోరాడే సీపీఐ(ఎం) ను ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు ఏలే కృష్ణ, శాఖ కార్యదర్శి పలుసం లింగం, సీనియర్ నాయకులు పలుసం బాలయ్య,గొలను కొండోజు స్వామి, పెద్దబోయిన కాంతయ్య,బత్తుల నరసింహ ,పెద్దబోయిన శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.