– అమెరికా అధ్య్యక్షుడి పుట్టినరోజున భారీ సైనిక కవాతు
– వలసదారుల అణచివేతలకు వ్యతిరేకంగా ‘నో కింగ్స్’ ప్రదర్శనలు
– పలు నగరాల్లో పెద్దఎత్తున ఆందోళనలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీరును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు, ప్రదర్శనలు జరిగాయి. అమెరికాలోని పలు నగరాల్లో ఈ ఆందోళనలు చోటు చేసుకున్నాయి. లక్షలాది మంది నిరసనకారులు ఇందులో పాల్గొన్నారు. డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఒకపక్క అమెరికా సైన్యం 250వ వార్షికోత్సవం.. మరోపక్క, డోనాల్డ్ ట్రంప్ బర్త్‌డే నేపథ్యంలో ఈ ఆందోళనలు జరిగాయి. ‘నో కింగ్స్’ ప్రదర్శనల నిర్వాహకులు దేశవ్యాప్తంగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో లక్షలాది మంది పాల్గొన్నారని చెప్పారు.
ట్రంప్ తన 79వ పుట్టిన రోజు సందర్భంగా శనివారం రోజున రాజధాని కాన్స్టిట్యూషన్ అవెన్యూలో భారీ సైనిక కవాతును నిర్వహించుకోవడాన్ని నిరసన కారులు తీవ్రంగా ఖండించారు. శనివారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ సైనిక కవాతును వీక్షించడానికి వైట్‌హౌస్‌కు దక్షిణంగా ఉన్న ప్రత్యేక స్టాండ్‌పై ట్రంప్ కూర్చుని ఉండగా, ఆయన ముందు 128 ట్యాంకులు, 6 వేల మందికి పైగా సైనికులతో ఈ కవాతు జరిగింది. 21 గన్ సెల్యూట్‌తో ట్రంప్‌నకు వందనం కూడా జరిగింది. 2017లో పారిస్‌లో ఇలాంటి కవాతు చూసిన ట్రంప్ తన మొదటి పదవీ కాలంలోనే ఇలాంటి కవాతు నిర్వహించడానికి ప్రయత్నించారు. కానీ అప్పుడు సాధ్యం కాలేదు. రెండోసారి అధ్యక్షుడైన తరువాత ట్రంప్ ఈసారి తన కలను నెరువేర్చుకున్నారు.
అయితే అధ్యక్షుడు ముందు సైనిక కవాతు జరుగుతుండగా, అమెరికా వ్యాప్తంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా పట్టణాల్లో రోడ్లపై నిరసన ప్రదరన్శలకు దిగారు. ప్రజాస్వామ్యం, ప్రజాహక్కులను కాపాడాలని నినాదాలు చేశారు. ట్రంప్‌నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రదర్శనల్లో ప్రజలు ‘నో కింగ్స్’ బ్యానర్లు పట్టుకుని పాల్గొన్నారు.
ఫిలడెల్ఫియా, లాస్ఏంజిలీస్, న్యూయార్క్ సిటీ, మిన్నేసొటా, నార్త్ కరోలినా, టెక్సాస్, మిస్సిస్సిపీ, పోర్ట్‌ల్యాండ్ సహా పలు నగరాల్లో ఆందోళనలు హోరెత్తాయి. లక్షలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. ర్యాలీలు నిర్వహించారు. వలసదారుల హక్కులను పరిరక్షించాలనీ, రాచరిక పోకడలు వీడాలనీ, కోర్టు ఉత్తర్వులను పాటించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. లాస్ ఏంజిలీస్లో నిరసనలు చెలరేగి దేశవ్యాప్తంగా ప్రదర్శనలకు దారి తీశాయి. ఆందోళనకారులను చెదరగొట్టటానికి టియర్ గ్యాస్, క్రౌడ్-కంట్రోల్ మందుగుండు సామాగ్రిని ఉపయోగించారు. యూఎస్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ భవనం ముందు నిరసన తెలిపిన జన సమూహాన్ని చెదరగొట్టటానికి పోర్ట్‌ల్యాండ్‌లోని అధికారులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
ఉటాలోని సాల్ట్ లేక్ సిటీలో, డౌన్టౌన్లో జరిగిన మార్చ్ సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీస్ చీఫ్ బ్రియాన్ రెడ్ ప్రకారం.. కాల్పులు జరిపిన వ్యక్తిగా భావిస్తున్న నిందితుడితో సహా ముగ్గురుని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. కాల్పులు రాజకీయ ప్రేరేపితమా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉన్నది. అయితే, నిరసనకారులు కవాతు సందర్భంగా చోటుచేసుకున్న ఈ కాల్పులు, ప్రదర్శకారులు పరుగెడుతున్నట్టు కనిపించే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. న్యూయార్క్, డెన్వర్, చికాగో, ఆస్టిన్, లాస్ ఏంజిలీస్లలో భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. ట్రంప్ యంత్రాంగానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నిరసనలు చేశారు. ‘నో కింగ్స్’ బ్యానర్లు ప్రదర్శించారు. అట్లాంటలో ఐదువేల మందితో ఆందోళన జరిగింది. సియాటిల్‌లోని అధికారులు నగరంలోని అతిపెద్ద ర్యాలీ డౌన్‌టౌన్‌కు 70వేల మందికి పైగా హాజరైనట్టు చెప్పారు.
జూన్ 14న.. అమెరికా ఆర్మీ 250వ వార్షికోత్సవం, డోనాల్డ్ ట్రంప్ పుట్టినరోజు.. రెండూ ఒకే రోజు వచ్చాయి. దీని సందర్భంగా జరిగిన సైనిక కవాతులో పాల్గొనటానికి డోనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్లో ఉన్నారు. వాయువ్య వాషింగ్టన్‌లోని లోగన్ సర్కిల్లో దాదాపు 200 మంది నిరసనకారులు గుమిగూడి ట్రంప్‌నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ట్రంప్ ఇప్పుడే వెళ్లాలి’ అనే నినాదాలు మార్మోగించారు. అధ్యక్షుడు కిరీటం ధరించి, బంగారు టాయిలెట్‌పై కూర్చున్న వ్యంగ్య చిత్రంను నిరసనకారులు ప్రదర్శించారు. కొన్ని చోట్ల అమెరికన్ జెండాలను తలకిందులుగా ఎగురవేశారు. వర్జీనియాలోని కల్పెప్పర్లో నిరసనకారులు ర్యాలీ నుంచి బయటకు వెళ్తుండగా… ఒక డ్రైవర్ (21) తన వాహనాన్ని (ఎస్యూవీ) జనంలోకి వేగంగా తీసుకెళ్లటంతో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. గతవారం ప్రారంభమైన ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు, ట్రంప్ నేషనల్ గార్డ్, మెరైన్లను లాస్ ఏంజిలీస్కు వెళ్లాలని ఆదేశించటంతో నిరసనలు చెలరేగిన నేపథ్యంలో ఈ నిరసన, ప్రదర్శనలు వచ్చాయి. ”ఈ రోజు ప్రధాన నగరాల్లో అమెరికన్లు శాంతియుత ఐక్యతతో నిలిచి స్పష్టం చేశారు. మేము రాజులను చేయం” అని ‘నో కింగ్స్’ కూటమి ఒక ప్రకటనలో పేర్కొన్నది.
ఫిలడెల్ఫియాలో జరిగిన నిరసనల్లో వేలాది మంది పాల్గొన్నారు. ‘ఒలిగార్కీతో పోరాడండి’, ‘మినీ ముస్సోలినీలను బహిష్కరించండి’ అని రాసి ఉన్న బోర్డును ఆందోళనకారులు ప్రదర్శించారు. ప్రజస్వామ్యాన్ని కాపాడుకోవాలని ప్రదర్శనకారులు తెలిపారు. ఒక రాజులా ట్రంప్ అనుసరిస్తున్న విధానాల పట్ల తీవ్ర వ్యతిరేకతను, ఆందోళనను వ్యక్తం చేశారు. ”నేను డోనాల్డ్ ట్రంప్‌నకు ఓటు వేశాను. ఇప్పుడు చింతిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఈ ఫాసిజాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లారు” అని నిరసనకారుడు వారడి అన్నాడు. వలసదారుల పట్ల ట్రంప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ న్యూయార్క్ నగరంలో నిరసనలు హోరెత్తాయి. ‘మన తల్లులు మన హక్కుల కోసం పోరాడారు. ఇప్పుడు మనం భవిష్యత్ తరాల కోసం కూడా పోరాడుతున్నాం’ అని గ్రిస్వోల్డ్ అనే వ్యక్తి అన్నారు. ‘రాజులు లేరు, కిరీటాలు లేవు. మేము నమస్కరించం’ అని నినాదాలు చేస్తూ ఆందోళనకారులు నార్త్ కరోలినాలో నినాదాలు చేశారు.
భగ్గుమంటున్న ట్రంప్ వ్యతిరేక నిరసనలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES