– డబ్బు, మద్యంతో ఎన్నికల్లో గెలవాలని అభ్యర్థుల కుయుక్తులు
– తనను గెలిపిస్తే పేద ప్రజల గొంతుకనవుతా : భువనగిరి నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ.జహంగీర్
– ఎన్నికల ప్రచారానికి గ్రామాల్లో ఘన స్వాగతం
నవతెలంగాణ -కట్టంగూర్
ప్రజాసమస్యలపై కనీస అవగాహన లేని.. పట్టుమని పది నిమిషాలు కూడా స్థానిక సమస్యలపై మాట్లాడలేని వారు ఎన్నికల బరిలో ఉన్నారు.. వారు డబ్బు, మద్యం.. ఇతర మాయమాటలతో గెలవాలని కుయుక్తులు పన్నుతున్నారని భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ.జహంగీర్ అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బహిరంగంగా చర్చించేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలంలోని ఈదులూరు, మునుకుంట్ల, కలిమెర, కట్టంగూరులో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ లో పేద ప్రజల తరఫున పోరాడేందుకే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు. 35 ఏండ్లుగా పేదల సంక్షేమం కోసం ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేస్తూ లాఠీ దెబ్బలు తింటూ జైలు జీవితాన్ని అనుభవించానని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిస్తే ఢిల్లీలో ఉంటారని, తనను గెలిపిస్తే గల్లీగల్లి తిరుగుతూ ప్రజల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తానని అన్నారు. సమస్యలపై పోరాడలేని అసమర్థులకు ఓటు వేయొద్దని, పోరాడే వారికి ఓటు అనే ఆయుధాన్ని ఇస్తే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. గతంలో గెలిచిన ఎంపీలు ఓట్లు వేయించుకొని ముఖం చాటేశారని, ఏనాడూ తమ గ్రామాలకు వచ్చి సమస్యలను అడగలేదని ప్రచారంలో అనేక గ్రామాల ప్రజలు తమకు తెలిపినట్టు చెప్పారు. ప్రభుత్వం మూసీ నదిని ప్రక్షాళన చేసి కాలుష్యం కోరల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు. బస్వాపురం కాలువను నెమలి కాల్వకు అనుసంధానం చేసి గోదావరి జలాలను మళ్లించాల న్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి దొరల పెత్తందారీ విధానాన్ని ఇంకా పాటిస్తున్నారని, ఆయన గురించి నియోజకవర్గ ప్రజలకు తెలుసునని అన్నారు. బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ కల్లుగీత కార్మికులపై కపట ప్రేమ చూపిస్తున్నారని, ఏనాడూ వారి కోసం పాటుపడలేదని విమర్శించారు. వారికి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు.సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. పదేండ్ల మోడీ పాలనలో ధరల పెరుగుదల, నిరుద్యోగంతో పేదరికం తీవ్రంగా పెరిగిందని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతూ దేశ సంపదను లూటీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపు తున్నారని విమర్శించారు. అంతకుముందు ఈదులూరు గ్రామంలో అభ్యర్థి జహంగీర్‌కు ప్రజలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. కోలాటాలు, డప్పు కళాకారులతో విన్యాసాలు నిర్వహించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లెల బాలకృష్ణ, నాయకులు గంజి మురళి, చినపాక లక్ష్మీనారాయణ, దండంపెల్లి సత్తయ్య, మండల కార్యదర్శి పెంజర్ల సైదులు, మురారి మోహన్, పున్న ఆగయ్య, గుడుగుంట్ల రామకృష్ణ, జాల రమేష్, జాల ఆంజనేయులు, ఊట్కూరి యాదయ్య మాద సైదులు పాల్గొన్నారు.