ఆ నాలుగూ రేవంత్‌కు ప్రతిష్టాత్మకం!

All four are prestigious for Revanth!– మల్కాజిగిరి సిట్టింగ్‌ మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ సొంత జిల్లా స్థానాలు భువనగిరిలో స్నేహితుడి పోటీ
– అన్నీ సర్వేలు కాంగ్రెస్‌ వైపే
–  ఎలాగైనా ఓడించాలని బీజేపీ, బీఆర్‌ఎస్‌ వ్యూహాలు
–  ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీకి ఎంత ప్రతిష్టాత్మకమో, వ్యక్తిగతంగా మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అంతే ప్రతిష్టాత్మకమని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఆ నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ విజయం రేవంత్‌ ప్రతిష్టను మరింత పెంచుతుందని భావిస్తున్నట్టుగా తెలుస్తున్నది. వాటితో ఆయనకున్న అనుబంధమే ఇందుకు కారణం కావొచ్చు. కాగా ప్రత్యర్థులు సైతం ఈ నాలుగింటిపై ప్రత్యేక నజర్‌ పెట్టడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం రేవంత్‌ సిట్టింగ్‌ స్థానం కావడంతో అక్కడి నుంచి బీసీ సామాజిక తరగతికి చెందిన ఈటల రాజేందర్‌ను బీజేపీ బరిలోకి దించింది. ఆ పార్టీ మళ్లీ గెలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు ఉండబోవంటూ రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో సైతం పెను దూమారం లేపాయి. ఆ పార్టీ అగ్రనేతలే రేవంత్‌ వ్యాఖ్యలపై స్పందించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని కమలనాథులు సీరియస్‌గా తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎట్లాగైనా మల్కాజిగిరిలో ఆయన్ను ఓడించడమే లక్ష్యంగా ఆ పార్టీ పని చేస్తున్నది. అందుకు ఎంచుకున్న సులువైన మార్గంగా వాట్సాప్‌ యూనివర్సిటీ ద్వారా మైండ్‌గేమ్‌ ఆడుతున్నది. ఈటల గెలుస్తుండు.. గెలుస్తుండు.. అంటూ ప్రచారమే తప్ప ఏ విధంగా గెలుస్తుండో మాత్రం చెప్పడం లేదు. సోషల్‌ మీడియా ద్వారా హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈటల నీవే గెలుస్తున్నావం టూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చామకుర మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు… బీజేపీకి బీఆర్‌ఎస్‌ లోపాయికారిగా మద్దతు ఇస్తుందా? అనే చర్చకు దారి తీశాయి. తుదకు బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్‌ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ మాజీ సీఎం కేసీఆర్‌ కూడా ఓ మాట పడేశారు. దీనిపై రేవంత్‌ కూడా సీరియస్‌గానే స్పందించిన విషయం తెలిసిందే. మల్కాజిగిరిలో కాంగ్రెస్‌ను ఓడించడం ద్వారా రేవంత్‌ ప్రతిష్టను మసకబార్చాలని ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి మహబూబ్‌నగర్‌లో పార్లమెంటు పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా లేని బీజేపీ… తామే గెలుస్తున్నామని చెబుతున్నది. కాంగ్రెస్‌ లక్ష్యంగా కాకుండా రేవంత్‌ను సొంతూరిలో ఓడించాలని కమలం నేతలు తాపత్రయపడుతున్నారు. అయితే అన్ని సర్వేలూ ఆ రెండు నియోజకవర్గాలు హస్తగతం కాబోతున్నాయని చెపుతున్నాయి. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ… సొంత అసెంబ్లీ నియోజకవర్గం గద్వాలలో పోటీ చేయకుండా ముఖం చాటేసింది. కాంగ్రెస్‌ అభ్యర్థి సరితను ఓడించేందుకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఆమె పరోక్షంగా మద్దతు ఇచ్చారనే విమర్శలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చాం కాబట్టి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్‌ఎస్‌ లోపాయికారిగా మద్దతు ఇస్తుందా? అనేది కూడా చర్చ జరుగుతున్నది. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించడమంటే, రేవంత్‌ను ఓడించడమేనని కమలం, కారు భావిస్తున్నాయి. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుట్రలను పసిగట్టిన రేవంత్‌…ఇప్పటికే అక్కడ కట్టుదిట్టమైన కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఆ రెండు పార్టీలకు చెందిన కీలక నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకుని ఆ పార్టీలకు చెక్‌పెట్టారు. స్థానికంగా చాలా మంది క్రియాశీలక క్యాడర్‌ను హస్తం గూటికి వచ్చేలా ప్లాన్‌ చేసి సక్సెస్‌ అయ్యారు. వీలైనన్నీ ఎక్కువసార్లు అక్కడికి వెళ్లి కాంగ్రెస్‌ క్యాడర్‌కు దిశా నిర్దేశం చేస్తున్నారు. కేవలం కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాంగ్రెస్‌కు దాదాపు 50వేల మెజార్టీ సాధిస్తామని రేవంత్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి లోక్‌సభలో తన స్నేహితుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించుకోవడం కూడా రేవంత్‌కు ఎంతో ప్రతిష్టాత్మకమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఒప్పించి, మెప్పించి ఆయనకు టికెట్‌ ఇప్పించారనేది తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో బ్రదర్స్‌ కూడా చామల గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి పని చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రమంతా కాంగ్రెస్‌ ఐక్యంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఎలాగైనా ఈ నాలుగు స్థానాల్లో ఓడించి రేవంత్‌ను దెబ్బకొట్టాలని బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నాయి. కాగా ఈ నాలుగింటితో పాటు రాష్ట్రమంతటా ఆ రెండు పార్టీలను చావు దెబ్బకొట్టాలని రేవంత్‌రెడ్డి వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. ఫలితం ఎలా ఉండబో తుందో వేచి చూడాల్సిందే.
సొంత జిల్లాలో ఓడించాలని..
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట, కొండారెడ్డిపల్లిలో పుట్టిన రేవంత్‌… రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. భవనం వెంట్రామిరెడ్డి తర్వాత మహబూబ్‌నగర్‌ జిల్లాకు తన ద్వారా మరోసారి సీఎం చాన్స్‌ వచ్చిందని రేవంత్‌ పదే పదే చెబుతున్నారు. ఆ జిల్లాలోని మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ రెండూ ఆయనకు సొంత నియోజకవర్గాలు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొండారెడ్డిపల్లి జన్మనిస్తే కొడంగల్‌ తనకు రాజకీయ జన్మనించిందని రేవంత్‌ పలు దఫాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించడం ద్వారా ఆయన్ను దెబ్బతీసేందుకు కారు, కమలం వ్యూహాలు పన్నుతున్నాయి. ఇక్కడ ఓడించి సొంత ఊర్లోనే గెలిపించుకోలేదంటూ రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నాయి.

Spread the love